షర్మిళ ప్రయత్నానికి జగన్ సహకారం ఇలానే ఉండాలంట!
అవును... తాజాగా ఓ జాతీయ మీడియాలో ఏపీ రాజకీయాలపై చర్చ జరిగింది. ఇందులో భాగంగా.. ఏపీలో ప్రతిపక్ష పాత్రను షర్మిళ, జగన్ లలో ఎవరు బాగా పోషిస్తున్నారనే మాటలూ వినిపించాయి.
ఏపీ అసెంబ్లీలో వార్ వన్ సైడ్ అయినట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీలో ప్రజాస్వామ్య వాతావరణం కనిపించడం లేదని, ప్రజల తరుపున ప్రశ్నించే గొంతుక లేకుండా పోయిందని, ఫలితంగా కుందేలుకు మూడే కాళ్లు అని కూటమి నేతలు అనుకున్నా కాలం గడిచిపోద్దనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఇక అసెంబ్లీ బయట కూడా ప్రజా సమస్యలపై బలమైన గొంతుక లోటు ఏపీలో స్పష్టంగా ఉందనే వాదనా తెరపైకి వచ్చింది.
అవును... తాజాగా ఓ జాతీయ మీడియాలో ఏపీ రాజకీయాలపై చర్చ జరిగింది. ఇందులో భాగంగా.. ఏపీలో ప్రతిపక్ష పాత్రను షర్మిళ, జగన్ లలో ఎవరు బాగా పోషిస్తున్నారనే మాటలూ వినిపించాయి. అయితే... 11 మంది బలం ఉన్న జగన్ కంటే.. సున్నా స్థానాలు ఉన్న షర్మిళ పోరాటాలే ఎక్కువగా ఉన్నట్లు జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది! ఈ నేపథ్యంలో... జగన్ ను షర్మిళ రీప్లేస్ చేసే ఛాన్స్ ఉందనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి!
ప్రస్తుతం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. అందుకు ఆయన చెబుతున్న కారణం... తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని.. అందువల్ల ప్రజా సమస్యలపై గళమెత్తడానికి తనకు అవకాశం దక్కదని చెబుతున్నారు. ఈ విషయంపై ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ సమయంలో... జగన్ కోరిక సహేతుకమైనదే అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు.
మరోవైపు అసలు 10 శాతం స్థానాలు సాధించకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదనేది ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి వెర్షన్ అని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఏపీ హైకోర్టులో ఉంది. ఆ సంగతి అలా ఉంటే.. పోరాడలనే పట్టుదల ఉండాలే కానీ, సంఖ్యా బలంతో సంబంధం ఏమిటని ప్రశ్నిస్తూ.. గతంలోని కొన్ని ఉదాహరణలు గుర్తుకు తెస్తున్నారు పరిశీలకులు.
ఏది ఏమైనా, ఎవరు ఎన్ని చెప్పినా... ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వరకూ జగన్ మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు దాదాపు లేవనే అంటున్నారు. అవసరమైతే.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో రోజుకో ప్రెస్ మీట్ పెట్టి.. తనపైనా, గత తన ప్రభుత్వంపైనా వచ్చిన విమర్శలకు వివరణ ఇస్తారని, ప్రజలముందు మీడియా ముఖంగా తన వెర్షన్ వినిపిస్తారని చెబుతున్నారు.
జగన్ పంతం అలా ఉంటే... ఈ గ్యాప్ లో షర్మిళ మాత్రం తనదైన శైలిలో ప్రశ్నించడం చేస్తున్నారని.. తనదైన శైలిలో వాయిస్ వినిపిస్తున్నారని.. ఈ విషయంలో అన్న వైసీపీ, టీడీపీ అనే తారతమ్యాలేవీ చూడటం లేదని అంటున్నారు. ఉదాహరణకు వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోగ్యశ్రీపై చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, హెచ్చరికలు కూడా జారీచేశారు షర్మిళ.
ఇదే సమయంలో... జగన్ అసెంబ్లీకి గైర్హాజరవ్వడంపైనా కడిగి పారేస్తున్నారు. ప్రజా సమస్యలపై స్పందించడం లేదంటూ విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు ఢిల్లీలో ధర్నాలు చేయడానికి చూపిస్తున్న ఉత్సాహం నాడు ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్ట్ విషయాల్లో ఎందుకు చూపించలేదని నిలదీస్తున్నారు! ఇక ఇటీవల కురిసిన వర్షాల వల్ల నీట మునిగిన నడుము లోతు నీళ్లలో దిగి మరీ పరిశీలించారు.
దీంతో... జగన్ ఇలా సైలంట్ గా ఉంటూ, ప్రెస్ మీట్ లకు, కార్యకర్తలతో ఫోటోలకు మాత్రమే పరిమితమవుతూ సహకరిస్తే... షర్మిల కచ్చితంగా ఆ స్థానాన్ని రీప్లేస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. కాకపోతే... ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో సెలక్టివ్ గా కాకుండా అన్ని అంశాలపైనా స్పందిస్తే.. షర్మిళ సిన్సియారిటీపై జనాల్లో ఉన్న సందేహాలు తొలగి పోతాయని చెబుతున్నారు.