వివేకా హంతకులు ఎవరో కాదు.. మా బంధువులే!

తన చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-03-15 09:10 GMT

తన చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని మండిపడ్డారు. తన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీతాయేనని తెలిపారు.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో మాట్లాడిన షర్మిల ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ పై పరోక్షంగా షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంతలా దిగజారిపోతారని అనుకోలేదన్నారు.

తన చిన్నాన్న హంతకులు ఎవరో కాదు.. తమ బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయని షర్మిల హాట్‌ కామెంట్స్‌ చేశారు. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా ఆరోపణలు చేస్తారా? అని నిలదీశారు. ఇవాళ్టి వరకు హత్య చేసిన, చేయించిన వాళ్లకు శిక్ష పడలేదని గుర్తు చేశారు.

చివరి క్షణం వరకు చిన్నాన్న వైసీపీ కోసమే పనిచేశారని షర్మిల తెలిపారు. సాక్షిలో పైన వైఎస్‌ ఫొటో.. కింద ఆయన తమ్ముడి వ్యక్తిత్వ హననం ఏమిటని ప్రశ్నించారు. జగనన్నా.. అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని కోరారు. మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినాలని జగన్‌ కు సూచించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా? అని షర్మిల ప్రశ్నించారు. ఆయన వారసుడిగా మీరేం చేశారని జగన్‌ ను నిలదీశారు.

చిన్నాన్న మరణాన్ని నమ్మలేమని షర్మిల అన్నారు. చనిపోయే ముందు చివరిసారి తన ఇంటికి వచ్చి తనను కడప ఎంపీగా పోటీ చేయాలని కోరారని గుర్తు చేసుకున్నారు. రెండు గంటలపాటు తనను ఒప్పించే ప్రయత్నం చేశారన్నారు. అన్నీ అనుకూలిస్తే పోటీ చేస్తాలే అనే వరకు చిన్నాన్న వెళ్లలేదన్నారు. ఆయన హత్య జరిగి ఐదేళ్లయినా ఇంకా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో షర్మిల వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి.

కాగా వివేకానందరెడ్డి స్మారక సభకు హాజరైన పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్‌ రవి సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య జరగడం పట్ల పులివెందుల వాసిగా సిగ్గుపడుతున్నా అని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాపై తాను పోటీచేసి గెలిచినప్పటికి ఆయన తనతో చాలా బాగా మాట్లాడే వారు అని గుర్తుచేశారు. వివేకా హత్య వెనుక తమ హస్తం ఉందని మొదట్లో అన్యాయంగా నిందవేశారని వాపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివేకా కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని బీటెక్‌ రవి డిమాండ్‌ చేశారు.

కాగా 2019 మార్చి 14న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిన సంగతి తెలిసిందే. మార్చి 15 నాటికి ఆయన మరణించి ఐదేళ్లు పూర్తయింది. ఇప్పటికే వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. ఇందులో భాగంగా కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, సునీల్‌ యాదవ్‌ తదితరులను సీబీఐ నిందితులుగా చేర్చింది. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పైన ఉన్నారు. మిగిలినవారు హైదరాబాద్‌ లోని చెంచల్‌ గూడ జైలులో ఉన్నారు. తాజాగా దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి.

Tags:    

Similar News