అసభ్య కామెంట్లు.. ఈ ఎనిమిది మందిపై షర్మిల ఫిర్యాదు!

తన అన్న, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వైఫల్యాలపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

Update: 2024-02-25 05:57 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ షర్మిల కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు కుదుర్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల దూకుడు పెంచారు. తన అన్న, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వైఫల్యాలపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు సైతం షర్మిలపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు చెప్పిందల్లా షర్మిల చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబుతో చేతులు కలిపిందని మండిపడుతున్నారు.

కాగా కొందరు తనను అసభ్య వ్యాఖ్యలతో వేధిస్తున్నారని.. వారి నుంచి తనకు ముప్పు కూడా ఉందని షర్మిల తాజాగా హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది. సామాజిక మాధ్యమాల్లో కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తూ అప్రతిష్ట పాలు చేస్తున్నారని షర్మిల తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

నేరపూరిత దురుద్దేశంతో తనను భయభ్రాంతులకు గురిచేసేలా పోస్టులు పెడుతున్నారని షర్మిల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళల ప్రతిష్ఠను దిగజార్చేలా కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లు.. ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టులు ఉంటున్నాయని తెలిపారు. అమెరికాలో ఉంటున్న మేదరమెట్ల కిరణ్‌కుమార్, రమేశ్‌ బులగాకుల, పంచ్‌ ప్రభాకర్‌ (అమెరికా), ఆదిత్య (ఆస్ట్రేలియా), సత్యకుమార్‌ దాసరి (చెన్నై), శ్రీరెడ్డి, వర్రా రవీందర్‌ రెడ్డి, మహ్మద్‌ రెహ్మత్‌ షా తనపై అసభ్య కామెంట్లు పెడుతున్నారని షర్మిల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సైబర్‌ క్రై మ్‌ పోలీసులు నిందితులపై రెండు కేసులు నమోదు చేశారు.

ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. తాను ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ లో ప్రజల్ని కలుస్తూ ప్రచారం ప్రారంభించానని షర్మిల తెలిపారు. ఈ సందర్భంగా కొందరు దురుద్దేశంతో సామాజిక మాధ్యమాల్లో తనపై, తన సహచరులపై అసభ్య కామెంట్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ నిరాధారమైనవే అయినా తనను అవమానించేలా ఉన్నాయన్నారు.

‘వైఎస్‌ షర్మిల ప్రాణాలకు ప్రమాదం.. దొంగల ముఠా.. వైఎస్‌ షర్మిల క్యాంపు కార్యాలయంలో కోవర్ట్‌ ఆపరేషన్‌’ అంటూ కొన్ని పీడీఎఫ్‌ ప్రతులను సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. ‘షర్మిల తన అన్నతో విభేదించి ౖవైఎస్సార్, వైఎస్‌ జగన్‌ లకు ఆజన్మ శత్రువైన చంద్రబాబుతో చేతులు కలిపి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోంది’ అని వ్యాఖ్యలు చేస్తున్నారని షర్మిల తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు, పోస్టులతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని షర్మిల పేర్కొన్నారు. వీరిపై చర్యలు తీసుకోకపోతే తనకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ నేపథ్యంలో మేదరమెట్ల కిరణ్‌ కుమార్, రమేశ్‌ బులగాకుల, పంచ్‌ ప్రభాకర్‌(అమెరికా), ఆదిత్య(ఆస్ట్రేలియా), సత్యకుమార్‌ దాసరి (చెన్నై), సేనాని, వర్రా రవీందర్‌రెడ్డి, శ్రీరెడ్డి, మహ్మద్‌ రెహ్మత్‌ పాషా తదితర వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులను కోరారు. కాగా ఈ ఫిర్యాదును వైఎస్‌ షర్మిల భర్త అనిల్‌ ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News