కడపలో గెలుపు మీద షర్మిల అంచనా అదే ?

ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చాలా కాలం అవుతున్నా ఎన్నికలలో పోటీ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం

Update: 2024-05-19 03:49 GMT

వైఎస్సార్ తనయ కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చాలా కాలం అవుతున్నా ఎన్నికలలో పోటీ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఆమె తెలంగాణాలో పార్టీ పెట్టి అక్కడ నుంచి పోటీ చేస్తారు అని అనుకున్నారు. కానీ ఆమె అనూహ్యంగా ఏపీ వైపు పొలిటికల్ టర్న్ తీసుకున్నారు. దాంతో పాటు వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట అయిన కడప నుంచి ఆమె ఎంపీగా పోటీలో నిలబడడం మరో సంచలన పరిణామంగానే అంతా చూసారు.

కడపలో వైసీపీ బలంగా ఉంది. ఆ తరువాత ప్లేస్ లో టీడీపీ ఉంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల ఎంపీగా పోటీ చేసి విజయం సాధిస్తారా అంటే ఎవరి ఆలోచనలు విశ్లేషణలు వారికి ఉన్నాయి. అయితే పోలింగ్ సరళి రాజకీయ పార్టీల వ్యూహాలు ఇవన్నీ చూసిన తరువాత షర్మిలకు అనుకూలంగా పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది అని అంటున్నారు.

కడప లోక్ సభ సీటుకు టీడీపీ నుంచి తొలిసారి ఎంపీగా పోటీ చేసిన మాజీ మంత్రి భూపేష్ ని సైడ్ చేసి మరీ టీడీపీ మెజారిటీ ఓట్లు షర్మిలకే పడ్డాయని అంటున్నారు. అంతే కాదు వైసీపీ నుంచి కూడా బాగానే క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా చెబుతున్నారు. ఇక షర్మిల వైఎస్సార్ కుమార్తె కావడం ఆమె సెంటిమెంట్ రంగరించి చేసిన ప్రసంగాలు వివేకా హత్య కేసు విషయాన్ని జనంలో ప్రస్తావించి న్యాయం చేయాలని అర్ధించడం వంటివి చూసిన మీదట న్యూట్రల్ ఓటర్లు మహిళా సెక్షన్ లో కొంత షర్మిల వైపు పడ్డాయని అంటున్నారు.

ఇక ముస్లిం రిజవేషన్లు రద్దు చేస్తామని బీజేపీ ప్రకటించిన నేపధ్యంలో కూటమికి ఓటు వేయాలనుకోని ఆ వర్గం వైసీపీ నుంచి కొంత షిఫ్ట్ అయి షర్మిలకు ఓట్లు వేసినట్లుగా చెబుతున్నారు. ఇక టీడీపీ కూటమి నేతలు కూడా పాతిక ఎంపీ సీట్లు తమకు రావు అని అంటున్నారు. తమకు ఇరవై నాలుగు ఎంపీ సీట్లు వస్తాయని చెప్పడంలోనే లాజిక్ పాయింట్ ఉంది అని అంటున్నారు. ఆ ఒక్క సీటూ కడప ఎంపీ సీటు కాంగ్రెస్ దే అని అంటున్నారు. ఆ విధంగా వైసీపీకి జీరో నంబర్ ఇచ్చారన్న మాట.

ఇదిలా ఉంటే పోలింగ్ సమయంలో ఓటు వేసిన సందర్భంగా షర్మిల ట్వీట్ చేశారు. ఆ తరువాత మాత్రం ఆమె నుంచి ఏమీ ట్వీట్ లేదు. అయితే తాజాగా ఆమె వేసిన మరో ట్వీట్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని షర్మిల వెల్లడించారు. భావ ప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి ఎప్పటికైనా ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని నిరూపణ అయిందని పేర్కొన్నారు.

అధికార బలాన్ని ఉపయోగించి మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసే వారికి ఈ స్టే చెంపపెట్టు అని షర్మిల స్పష్టం చేశారు. ఈ విజయం తొలి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో వివేకా కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉద్ధృతం చేస్తాం. చిట్టచివరిగా విజయం, నిజం, న్యాయం వైపే ఉంటాయని చూపిస్తాం అని షర్మిల ఉద్ఘాటించారు. దానిని బట్టి ఆమె కడప ఎంపీ సీటు విషయంలో ధీమాగా ఉన్నారు అని అంటున్నారు. తన గెలుపు ఖాయమని ఆమె భావిస్తున్నారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే రాజకీయ సంచలనమే అని అంటున్నారు. ఇక చూస్తే కడపలో వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఎంపీ సీటులో పోరు సాగింది అని అంటున్నారు. మరి ఈ పోరులో షర్మిల విన్నరా లేక రన్నరా అన్నది జూన్ 4న తేలనుంది.

Tags:    

Similar News