రేవంత్ పేరు చెప్పి బాబుని ప్రశ్నించిన షర్మిళ!
ఈ సందర్భంగా అటు తన అన్న జగన్ పై పలు ప్రశ్నలు సంధిస్తూ, ఇటు అధికార పక్షాన్ని నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి యాక్టివ్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆమె ఫైర్ బ్రాండ్ గా మారుతున్నారు. ఈ సందర్భంగా తాజాగా మీడియాతో మాట్లాడిన షర్మిళ కీలక అంశాలను ప్రస్థావిస్తూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అటు తన అన్న జగన్ పై పలు ప్రశ్నలు సంధిస్తూ, ఇటు అధికార పక్షాన్ని నిలదీశారు.
అవును... ఏపీ కాంగ్రెస్ కు అధినేత్రిగా మారినప్పటి నుంచి ఫైర్ నిప్పులు చెరుగుతున్న వైఎస్ షర్మిళ... తాజాగా తన అన్న వైఎస్ జగన్ పై నిప్పులు కురిపిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబునూ నిలదీశారు. ఇందులో భాగంగా.. తమ తండ్రి వైఎస్సార్ 75వ జయంతి రోజున ఇడుపులపాయకు వెళ్లి ఐదు నిమిషాలు నిలబడి వచ్చేయడం తప్ప... ఏమి చేశారని ప్రశ్నించారు.
ఇదే సమయంలో... ఏపీలో ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు ఇచ్చిన "ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం" హామీపైనా ప్రభుత్వాన్ని నిలదీశారు వైఎస్ షర్మిళ. ఈ సందర్భంగా కర్ణాటక, తెలంగాణలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన విషయన్ని గుర్తు చేస్తూ చంద్రబాబుని ప్రశ్నించారు. బాబు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని అడిగారు.
ఇందులో భాగంగా... ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అటు కర్ణాటకలోనూ, ఆ తర్వాత తెలంగాణలోనూ విజయవంతంగా ప్రారంభించిందని చెప్పిన షర్మిళ... రేవంత్ రెడ్డి మాటమీద నిలబడి, అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే మహిళా సాధికారితలో భాగంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారని తెలిపారు.
ఈ విధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఈ హామీని నెరవేర్చి, మహిళలకు ఆ సౌకర్యం కల్పించినప్పుడు.. ఏపీలో చంద్రబాబు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం.. ఈ కార్యక్రమాన్ని ఏపీలో త్వరగా అమలు చేయాలని పునరుధ్గాటించారు. కర్ణాటకలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు వారాలకు ఈ పథకం ప్రవేశపెట్టింది!
అయితే... ఇటీవల విభజన సమస్యలపై చర్చించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ అయినప్పుడు... ఈ పథకానికి సంబంధించిన కార్యచరణ ప్రణాళికను గురించిన చర్చ వచ్చిందంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. త్వరలోనే ఏపీలోనూ ఈ పథకం ప్రారంభమవ్వబోతోందని అంటున్నారు!