షర్మిల పార్టీ...ఎక్కడో డౌట్ కొడుతోందా...?

ఇంకో వైపు చూస్తే సర్వేలు అన్నీ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండడంతో పోటీ చేసినా ఓటమి తప్పదని కూడా తేలడంతోనే ఆమె వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు అని అంటున్నారు.

Update: 2023-10-29 01:30 GMT

వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల తెలంగాణాలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తారా చేయరా అన్న డౌటానుమానం అయితే అందరిలో కలుగుతోంది అంటున్నారు. వైఎస్సార్టీపీని చాలా కాలం ముందే స్థాపించి దాదాపుగా మూడున్నర వేల కిలోమీటర్ల పైన పాదయాత్ర తెలంగాణా అంతటా చేసి కేసీయార్ ప్రభుత్వం మీద ప్రతీ రోజూ విమర్శలు చేస్తూ వచ్చిన వైఎస్ షర్మిల తీరా ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఏమి చేస్తారో అన్న చర్చ అయితే సాగుతోంది.

ఆమె పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా చేస్తే ఎన్ని సీట్లలో పోటీ పడుతుంది ఇవన్నీ ప్రశ్నలే అంటున్నారు. నిజానికి వైఎస్సార్టీపీలో ఏకైక నాయకురాలిగా షర్మిల మాత్రమే కనిపిస్తున్నారు. ఆమె పార్టీలో మిగిలిన వారు ఉన్నా ఎమ్మెల్యేగా పోటీ చేసే సామర్ధ్యం ఎంతమందికి ఉన్నది అన్నది ఒక ప్రశ్నగా ఉంది. ఇక షర్మిల తాను రెండు సీట్లలో పోటీ చేస్తారని ప్రచారంలోకి వచ్చింది. ఇటీవల ఆమె పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి మరీ పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అలాగే మరో సీటు నుంచి కూడా పోటీ ఉంటుందని పేర్కొన్నారు.

ఇపుడు చూస్తే అన్ని పార్టీలు అభ్యర్ధులను ఖరారు చేసి నామినేషన్లకు అంతా సర్దుకుంటూంటే షర్మిల పార్టీలో సైలెంట్ కనిపిస్తోంది అని అంటున్నారు. ఆమె పార్టీకి బైనాక్యులర్ గుర్తుని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. అయితే ఈ గుర్తు మీద అసంతృప్తిని వ్యక్తంచేస్తూ తమ పార్టీకి నాగలి లేక మరో మంచి గుర్తు కావాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి.

ఇక బైనాక్యులర్ గుర్తు మీద అయితే సెటైర్లు ఒక్క లెక్కన సోషల్ మీడియాలో పడుతున్నాయి. పార్టీ ఎక్కడ ఉందో అందులో చూసుకోవాలని కూడా కామెంట్స్ చేసిన వారు కూడా ఉన్నారు. మరి గుర్తు మారుతుందా లేదా అన్నది ఒక సందేహం అయితే ఆమె పార్టీ పోటీలో ఉంటుందా లేదా ఇంతకీ షర్మిల అయినా పోటీ చేస్తారా అన్నది మరో ప్రశ్నగా ఉంది.

పాలేరులో చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు అని ప్రచారంలో ఉంది. పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తే షర్మిల పోటీకి దిగినా కొంత వరకూ బాగుండేది అని అంటున్నారు. తుమ్మల కమ్మ సామాజికవర్గం నేత కావడంతో అక్కడ రెడ్డి సామాజికవర్గం ఓట్లలో కొంత ఆమె చీల్చుకునే సీన్ ఉండేదని అంటున్నారు. అయితే కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగానే పొంగులేటిని అక్కడ బరిలోకి దించింది. దాంతో రెడ్డి ఓట్లలో చీలిక రాదు, పైగా ఆయన వైఎస్సార్ కుటుంబానికి కావాల్సిన వారు.

దాంతో షర్మిల పోటీ చేస్తారా లేదా అన్న చర్చ కూడా మొదలైంది. ఒకవేళ పోటీ చేసినా ఆమెకు డిపాజిట్లు వస్తాయ రావా అన్నది మరో చర్చగా ఉంది. దాంతో ఆమె పునరాలోచనలో ఉన్నారా అని కూడా డౌట్లు వ్యక్తం చేస్తున్న వారూ ఉన్నారు. ఇక తన పార్టీ తరఫున పోటీ చేసే వారు దరఖాస్తు చేసుకోవాలని షర్మిల కోరినా ఇప్పటిదాకా ఎవరూ దరఖాస్తు చేసినట్లుగా కనిపించడంలేదు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే సర్వేలు అన్నీ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండడంతో పోటీ చేసినా ఓటమి తప్పదని కూడా తేలడంతోనే ఆమె వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు అని అంటున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే తరువాత జరిగే ఎంపీ ఎన్నికల నాటికైనా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఎంపీగా పోటీ చేసే అవకాశాలను ఆమె పరిశీలిస్తున్నారా అన్న ప్రచారం కూడా సాగుతోందిట.

ఏది ఏమైనా షర్మిల పోటీ చేయకపోవడమే ఈ సమయంలో సరైన డెసిషన్ అని శ్రేయోభిలాషులు హితైషులూ సూచిస్తున్నారుట. కాంగ్రెస్ గెలిస్తే అది ఆమె రాజకీయ జీవితానికి మంచిదే అవుతుంది అని అంటున్న వారూ ఉన్నారుట. ఒకవేళ కాంగ్రెస్ ఓడినా అపుడు కూడా ఆమె పార్టీ విలీనానికి మాట చెల్లుబాటుకూ అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఏ విధంగా చూసుకున్నా ఆమె బరిలో లేకపోతేనే భవిష్యత్తు ఉంటుందని అంటున్నారుట. మరి షర్మిల మౌనం చూస్తూంటే ఆమె వ్యూహాత్మక ఎత్తుగడలోనే ఉన్నారా అని డౌటానుమానాలు వ్యక్తం చేస్తున్నారుట.

Tags:    

Similar News