ఆరోగ్య శ్రీ బకాయిలు ఎందుకివ్వలేదు: జగన్‌కు షర్మిల సూటి ప్రశ్న
ఏపీలో వివాదంగా మారిన ఆరోగ్య శ్రీ పథకం నిధుల విడుదల అంశం.. రాజకీయ దుమారానికి దారి తీసింది
ఏపీలో వివాదంగా మారిన ఆరోగ్య శ్రీ పథకం నిధుల విడుదల అంశం.. రాజకీయ దుమారానికి దారి తీసింది. తమకు ప్రభుత్వం నుంచి అందాల్సిన బకాయిలు పేరుకుపోయాయని, దీంతో తాము పేదలకు సేవలు అందించడం కష్టసాధ్యంగా మారిందని పేర్కొంటూ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు తాజాగా బహిరంగ లేఖ రాశాయి. దీనిలో పలు ఆరోపణలు చేశాయి. గత ఏడాది సెప్టెంబరు వరకు బాగానే ఉన్నప్పటికీ.. తర్వాత తమకు ఇవ్వాల్సిన బకాయిలను విడుదల చేయకుండా నాన్చుడు ధోరణి ప్రదర్శించారని దీంతో తమ పరిస్థితి దారుణంగా తయారైందని పేర్కొన్నాయి.
ముఖ్యంగా గత 2023 సెప్టెంబరు నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.2500 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయని తెలిపారు. వీటిలోనూ ఏప్రిల్ మాసానికి రూ.1750 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిలో రూ.500 కోట్లు ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేదన్నారు. ఈ కారణంగా ఆసుపత్రులను నడపలేని పరిస్థితి నెలకొందని ప్రైవేటు యాజమాన్యాలు పేర్కొన్నారు. దీనిపై తాజాగా స్పందించిన కాంగ్రెస్ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. గత జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తీసుకువచ్చిన అద్భుత పథకాల్లో ఆరోగ్య శ్రీ ఒకటని తెలిపారు. ఇతర రాష్ట్రాలు సహా కేంద్రం, అమెరికా వంటి దేశాలు కూడా దీనిని కాపీ కొట్టాయన్నారు.
పేదలకు సైతం కార్పొరేట్ వైద్యాన్నిఅందించాలన్న లక్ష్యంతో తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీని జగన్ నత్తనడకన నడిపించారన్నారు. వైఎస్ కు వారసుడినని చెప్పుకొనే జగన్.. ఆరోగ్య శ్రీని ఇంత దారుణంగా ఎందుకు దిగజార్చారో సమాధానం చెప్పాలని షర్మిల నిలదీశారు. అంతేకాదు.. గత ఏడాది సెప్టెంబరు నుంచి నిధులు ఎందుకు ఇవ్వలేదన్నారు. 2500 కోట్ల నుంచి రూ.3000 కోట్ల రూపాయల వరకు బకాయిలు పేరుకుపోయిన పాపం జగన్ ప్రభుత్వానిదేనని, దీనికి ఆయనే స్పందించాల్సి ఉందని తెలిపారు. వైఎస్ వారసుడినని చెప్పుకొని అధికారంలోకి వచ్చినజగన్ ఆయన పెట్టిన పథకాన్ని నీరుగార్చడం దారుణమని విమర్శిం చారు.
ఈ సందర్భంగా జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆరోగ్య శ్రీపథకాన్ని కూడా అమలు చేయకుండా జగన్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వమైనా.. బకాయిలు చెల్లించేందుకు మొగ్గు చూపించాలని షర్మిల కోరారు. ఎన్నికలకు ముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చంద్రబాబుకు తెలుసునని.. ఇప్పుడు ఆయన కొంత మేరకు భారం భరించైనా ఈ పథకాన్ని కొనసాగించాలని షర్మిల విన్నవించారు. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించాలని సూచించారు.