షర్మిలను అడ్డుకోవడమే రేవంత్ మొదటి విజయం

తెలుగు రాష్ట్రాల చరిత్రలో మరో అంకం మొదలైంది.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది.

Update: 2023-12-04 07:25 GMT

తెలుగు రాష్ట్రాల చరిత్రలో మరో అంకం మొదలైంది.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి మరీ పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ.. ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు దాదాపు సిద్ధమైంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత తక్కువే. ఆ మాత్రం దానిని కూడా ఆయన అధిగమించగలవారే. అయితే, ఇక్కడే కాంగ్రెస్ చాన్సివ్వలేదు. మరీ ముఖ్యంగా రేవంత్ వ్యూహమే హస్తం పార్టీ గెలుపునకు కారణమైందని చెప్పొచ్చు.

ఉమ్మడి రాష్ట్ర సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిది చెరగని ముద్ర. చంద్రబాబు హవాలో పనైపోయిందనుకున్న కాంగ్రెస్ ను ఒంటిచేత్తో గెలిపించిన చరిత్ర ఆయనది. అలాంటి చరిష్మా కాంగ్రెస్ లో మరే నాయకుడికీ సాధ్యం కాదు. ఆ చరిష్మాలోనే వైఎస్ కూతురు షర్మిల రాష్ట్ర విభజన తర్వాత కూడా సొంతంగా తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేశారు. వాస్తవానికి అన్న జగన్ ఏపీలో సీఎంగా ఉండగా.. షర్మిల తెలంగాణను ఎంచుకోవడమే తప్పు. అయినప్పటికీ ఏదో వ్యూహం ఉందనుకున్నా.. వైఎస్ మరణం అనంతరం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. దీంతో వైఎస్ పై అభిమానం పక్కకుపోయింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడ్డాక మరింతగా ‘‘మన రాష్ట్రం’’ అనే భావన తెలంగాణ ప్రజల్లో పెరిగింది. అలాంటి సమయంలో షర్మిల సొంత పార్టీ అంటూ తెలంగాణకు వచ్చి హడావుడి చేయడం గమనార్హం.

వైఎస్ పై అభిమానం వేరు.. తెలంగాణ వాదం వేరు

ఉచిత విద్యుత్తు, ఆరోగ్య శ్రీ వంటి సంక్షేమ కార్యక్రమాల రూపశిల్పిగా వైఎస్ పై ఇప్పటికీ తెలంగాణలో పేరుంది. కానీ, అభిమానం వేరు. రాజకీయ ప్రాధామ్యం వేరు. ఇలాంటి సమయంలో ఆయన పేరిట వైఎస్సార్టీపీ అంటూ పార్టీని ఏర్పాటు చేసి రెండేళ్ల పాటు హంగామా రేపారు వైఎస్ షర్మిల. వైఎస్ కూతురుగా జనం చూసేందుకు వచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంపై కీలక అంశాలతో విమర్శలకు దిగడంతో ప్రజల్లోనూ చర్చనీయాంశం అయ్యారు. ఆ తర్వాత ఉద్యమాలు అంటూ దీక్షలు అంటూ ఆందోళనలు చేశారు. మొత్తానికి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం అనే సంకేతాలు ఇచ్చారు. కానీ, తీరా తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో విలీనం అంటూ సిద్ధపడ్డారు. అయితే.. ఇది సాధ్యపడలేదు.

ఆమె గనుక వచ్చి ఉంటే..

షర్మిల ఈ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నారు. దీనికిముందే కాంగ్రెస్ లో విలీనం ప్రక్రియ కూడా జరగలేదు. ఒకవేళ కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనమై.. ఆమెను తెలంగాణలో ప్రచారానికి తిప్పి ఉంటే.. ఈ అవకాశాన్ని బీఆర్ఎస్ చక్కగా ఉపయోగించుకునేది. తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ కూతురు వస్తోంది అంటూ ప్రచారం చేసేవారు. కేసీఆర్ వంటి వారు ఇలాంటి అవకాశం కోసమే కాచుకుకూర్చుని ఉన్నారు. షర్మిల సొంతంగా పోటీ చేసినా ఇదే ప్రచారం చేసేవారే. అయితే, దీనికి అవకాశం ఇవ్వకుండా చేశారు రేవంత్. టీపీసీసీ చీఫ్ గా ఆయన షర్మిల పార్టీ విలీనాన్ని వ్యతిరేకించారని చెబుతారు. ఒకవేళ ఏదైనా ఉంటే ఎన్నికల తర్వాత చూసుకుందాం అని అధిష్ఠానానికి చెప్పి ఉంటారు. ‘‘ఒకవేళ రేవంత్ గనుక అడ్డుపడక పోయి ఉంటే కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం అయ్యేది. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున షర్మిల ప్రచారం చేసి ఉండేవారు. ఇది బీఆర్ఎస్ కు ఆయుధంగా మారేది. అప్పడు తెలంగాణ ఎన్నికల ముఖచిత్రమే మారిపోయేది. బీఆర్ఎస్ కు ఎడ్డ్ ఉండేది’’ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలా జరగకుండా.. షర్మిలకు మొదట్లోనే చెక్ పెట్టి నాయకుడిగా విజయవంతమయ్యారు రేవంత్ రెడ్డి.

కొసమెరుపు: తెలంగాణలో కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్యన సీట్ల తేడా 15. మాత్రమే. అందులోనూ సీఎంగా కేసీఆర్ కు 32 శాతంమంది ఓటేసినట్లు ఓ ఎగ్జిట్ పోల్ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల గనుక వచ్చి ఉంటే ఫలితంపై తీవ్ర ప్రభావం పడేది అనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News