షర్మిలతో సునీత భేటీ... నెక్స్ట్ స్టేప్ ఇదేనంట!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ హాట్ హాట్ గా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ హాట్ హాట్ గా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధానంగా వైఎస్ షర్మిళ... ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత వాతావరణం మరింత వేడెక్కింది! ఈ క్రమంలో మరో కీలక పరిణామం జరిగింది.. వైఎస్ షర్మిళతో వైఎస్ వివేకా కూతురు సునీత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెక్స్ట్ స్టెప్ పై నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
తెలంగాణ రాజకీయాలకు తెర దించి ఏపీ రాజకీయాల్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల... ఏపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచీ అధికార వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అటు రాజకీయంగా, ఇటు కుటుంబ పరమైన విషయాలను సైతం ప్రస్థావిస్తున్నారు. ఈ సమయంలో తన సోదరి, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తెతో షర్మిల భేటీ అయ్యారు.
అవును... ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో భేటీ అయ్యారు. సుమారు 2 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సునీత కూడా త్వరలో కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం దృష్ట్యా ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత ఆమెను కలవడం ఇదే తొలిసారి.
ఈ భేటీలో సునీత రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. తన తండ్రి మరణంపై సునీత తొలి నుంచి గట్టి పోరాటమే చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రాజకీయంగా కూడా వివేకా వారసత్వాన్ని కంటిన్యూ చేయాలని భావిస్తున్న సునీత... ఇవాళ జరగబోయే కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరవుతారని తెలుస్తుంది. ఆ సమావేశంలోనే ఆమె పొలిటికల్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే... ఆమె కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఆల్ మోస్ట్ కన్ ఫాం అయినప్పటికీ... పులివెందుల నుంచి అసెంబ్లీకి, కడప ఎంపీ స్థానం నుంచి లోక్ సభకు పోటీ చేసే విషయంపై క్లారిటీ రావొచ్చని అంటున్నారు.
మరోవైపు ఇడుపులపాయ ఎస్టేట్ కు వచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా షర్మిలతో భేటీ అయ్యారు. ఆయన వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీ చేయబోతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో ఆయనకు గుంటూరు జిల్లాకు సంబంధించి షర్మిల పలు కీలక బాధ్యతలు అపగించబోతున్నారని తెలుస్తుంది. అందులో ఆపరేషన్ ఆకర్ష అనేది ప్రధానమైన విషయం అని తెలుస్తుంది.