హాట్ టాపిక్... అంగన్వాడీల సమస్యలపై ఉద్యమించనున్న షర్మిళ!!
ఇందులో భాగంగా... టెర్మినేషన్ ఆర్డర్లు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఏపీలో అంగన్ వాడీ టీచర్లు, ఆయాల సమస్య అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత 42 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు, హెల్పర్లు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా "చలో విజయవాడ" కార్యక్రమం చేపట్టారు. దీంతో ఏపీ సర్కార్ ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుంది. ఇందులో భాగంగా... టెర్మినేషన్ ఆర్డర్లు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.
అవును... సమ్మె చేస్తోన్న అంగన్వాడీలు, హెల్పర్లపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా గడువు లోపు విధుల్లో చేరని వారిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ సమయంలో ఏపీసీసీ చీఫ్ గా తాజాగా బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిల ఈ విషయంపై రంగంలోకి దిగబోతున్నారా? ఈ విషయంలో మహిళా ఉద్యోగులైన వీరికి అండగా నిలబడబోతున్నారా? అనే చర్చ ఆన్ లైన్ వేదికగా మొదలైంది.
వాస్తవానికి అంగన్ వాడీల నిరసన దీక్షల వ్యవహారం ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదో.. లేక, లైట్ తీసుకున్నారో తెలియదు కానీ... ఈ విషయంపై స్పందించాల్సిన స్థాయిలో టీడీపీ - జనసేనలు స్పందించలేదనే కామెంట్లు అటు అంగన్ వాడీల్లో నుంచి, ఇటు రాజకీయవర్గాల్లోనూ వినిపిస్తున్నాయి! ఈ సమయంలో ఒక మహిళగా.. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉండే అవకాశాలున్నయనే చర్చ సోషల్ మీడియా వేదికగా మొదలైంది.
ఇందులో భాగంగా తన రాకతో ఏపీ కాంగ్రెస్ కు సరికొత్త ఉత్సాహం వచ్చిందని చెబుతున్న వేళ.. ఇంతకాలం స్థబ్ధగా ఉన్న ఏపీ కాంగ్రెస్ లో కదలికలు వచ్చాయనే కామెంట్లు వినిపిస్తున్న వేళ... ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారిన అంగన్ వాడీల సమస్యలపై వైఎస్ షర్మిల రంగంలోకి దిగితే.. వ్యవహారం రసవత్తరంగా మారే అవకాశాలున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పోరాటం రాజకీయంగా అటు వ్యక్తిగతంగా షర్మిలకు.. పార్టీ పరంగా కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందని అంటున్నారు.
పైగా తెలంగాణలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకుల సమయంలో నిరసనలు చేపడుతూ బలంగా తన వాయిస్ ని వినిపించిన అనుభవం కూడా ఇటీవల కాలంలో షర్మిల సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో తనను అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులపై చేయి చేసుకున్న వీడియోలు వైరల్ అయ్యాయి! ఈ నేపథ్యంలో... ఏపీలో ప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్ గా మారిన.. పొలిటికల్ గా మాంచి మైలేజ్ తెచ్చే ఈ అంగన్ వాడీ సమస్యలపై షర్మిల ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి!
మరోపక్క, ఈ విషయం షర్మిల దృష్టికి చేరిందని.. ఈ సమస్యపై ఆమె ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని.. అది ఆమరణ నిరాహార దీక్ష అయ్యే అవకాశాలూ లేకపోలేదని పలువురు నెటిజన్లు, ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా... అంగన్ వాడీల సమస్యలపై షర్మిల తనదైన శైలిలో స్పందించే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.