కొడుకును చూడక రెండేళ్లు..మాట్లాడి ఏడాది..మాజీ క్రికెటర్ తీవ్ర ఆవేదన

2023లో ఆమెతో అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. అయితే, వీరిద్దరి కుమారుడు జోరావర్ ప్రస్తుతం ఆయేషా సంరక్షణలో ఉన్నాడు.

Update: 2025-02-16 14:40 GMT

స్టార్ కపుల్ జీవితం పూల పాన్పు అనుకుంటే తప్పులో కాలేసినట్లే...ఎంతో ప్రేమించి.. వయసు అంతరం కూడా పట్టించుకోకుండా.. దేశాల సరిహద్దులను దాటి మరీ పెళ్లి చేసుకున్నా.. వారి కాపురం పది కాలాలు నిలుస్తుందని చెప్పలేం.. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ విషయంలోనే ఇది రుజువైంది. వివాహ బంధం ముగిస్తే ఫర్వాలేదు.. వారు విడిపోయిన కారణంగా పిల్లలు దూరమైతేనే మరీ ఇబ్బంది.

టీమ్ ఇండియా ఏడెనిమిదేళ్లు ప్రాతినిధ్యం వహించాడు శిఖర్ ధావన్. ఓపెనర్ గా తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా ఐసీసీ ట్రోఫీల్లో ధావన్ చెలరేగేవాడు. 2015 వన్డే ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన ధావన్ 2019 వన్డే ప్రపంచ కప్ లో గాయంతో దూరమయ్యాడు. లేదంటే కథ వేరేలా ఉండేది. 167 వన్డేల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ధావన్ 6793 పరుగులు సాధించాడు. సగటు 44.11. ఇక 34 టెస్టుల్లో ధావన్ 2315 పరుగులు చేశాడు. 68 టి20ల్లో 1759 పరుగులు సాధించాడు. 2018లో చివరి టెస్టు, 2022లో చివరి వన్డే, 2021లో ఆఖరి టి20 ఆడిన ధావన్ దాదాపు రెండేళ్ల కిందట రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఇక 39 ఏళ్ల ధావన్ తన కంటే వయసులో పెద్దదైన ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్నాడు. బాక్సర్ అయిన ఆయేషా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. 2023లో ఆమెతో అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. అయితే, వీరిద్దరి కుమారుడు జోరావర్ ప్రస్తుతం ఆయేషా సంరక్షణలో ఉన్నాడు. కేవలం సందర్శన హక్కులు కలిగినప్పటికీ, తన కుమారుడితో కనెక్ట్ అవ్వడానికి అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ, తన కుమారుడి చివరిసారిగా రెండు సంవత్సరాల క్రితం చూసినట్లు, ఒక సంవత్సరం క్రితం చివరిసారిగా మాట్లాడినట్లు వెల్లడించాడు. ‘జొరావర్ ను మిస్ అవుతున్నా. ప్రతి రోజూ అతడితో ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నట్లు భావిస్తా. ధ్యానం చేస్తూ, అతడిని కౌగిలించుకుంటున్నట్లు, అతడితో గడిపే ప్రతి క్షణాన్ని మనసులో ఊహించుకుంటా’’ అని వివరించాడు.

తనను అన్నిచోట్లా బ్లాక్ చేసినప్పటికీ, ఇప్పటికీ మూడు లేదా నాలుగు రోజులకు ఒకసారి జొరావర్ కు సందేశం పంపుతూనే ఉంటానని తెలిపాడు. కుమారుడిని భవిష్యత్తులో కలిసే అవకాశం వస్తే ఆ క్షణాన్ని ఎలా ఆస్వాదిస్తాడో ధావన్ భావోద్వేగంతో చెప్పాడు. “మొదట కౌగిలించుకుంటా. అతడి మాట వినడానికి ప్రాధాన్యం ఇస్తా. అతను తన భావాలను పంచుకుంటే, బహుశా నేను కూడా అతడితో కలిసి భావోద్వేగానికి గురవుతా” అని ధావన్ తెలిపాడు.

Tags:    

Similar News