చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని.. నాలుక కోసుకున్న వ్యక్తి!
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. నాలుక కోసుకున్న వ్యక్తి చంద్రబాబుకు లేఖ కూడా రాశారు.
ఏపీలో జరుగుతున్న పోలింగ్ సంచలనంగా మారుతోంది. ఒకవైపు అగ్రనేతలు గెలుస్తారా? లేదా? అని రూ.కోట్లలో పందేలు కడుతున్నవారు కనిపిస్తున్నారు. మరోవైపు.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ.. పూజలు చేస్తున్నవారు కొందరు కనిపిస్తున్నారు. అలాగే.. వైసీపీ అధినేత జగన్ మరోసారి గెలవాలంటూ.. ఆదివారం పలు చర్చిల్లో ప్రార్థనలు జరిగినట్టు తెలిసింది. ఇక, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ.. హైదరాబాద్కు చెందిన వ్యక్తి నాలుక కోసు కోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. నాలుక కోసుకున్న వ్యక్తి చంద్రబాబుకు లేఖ కూడా రాశారు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఆయన వేడుకోవడం గమనార్హం. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని దేవుడిని వేడుకున్నానని.. ఈ క్రమంలోనే నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్నాన ని సదరు వ్యక్తి పేర్కొనడం గమనార్హం.
ఎవరీ అభిమాని?
చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటూ.. నాలుక కోసుకున్న అభిమాని చెవల మహేష్. ఈయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం గూటల గ్రామం. ప్రస్తుతం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారు.
లేఖలో ఏముంది?
చెవల మహేష్ రాసిన లేఖలో ఏపీ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో మూడు సార్లు నాలుక కోసుకున్నట్టు మహేష్ తెలిపారు. 2004, 2009లో వైఎస్ ముఖ్యమంత్రి కావాలని, 2019లో జగన్ సీఎం కావాలని ఇలానే నాలుకకోసుకున్నట్టు మహేష్ వివరించారు. ఇప్పుడు ఏపీలో పోటీ చేస్తున్న కూటమి పక్షాల విజయం కాంక్షిస్తూ.. ముఖ్యంగా చంద్రబాబు మరోసారి ఏపీ సీఎం కావాలన్న ఆకాంక్షతో నాలుక కోసుకున్నట్టు తెలిపారు. కూటమి 100-145 సీట్లలో విజయం దక్కించుకోవాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. అలాగే.. పార్లమెంటు స్థానాల్లో 15-20 దక్కాలని ఆకాంక్షిస్తున్నట్టు లేఖలో వివరించడం గమనార్హం.