పొలిటికల్ ఎంట్రీపై ప్రభాస్ పెద్దమ్మ ఆసక్తికర సమాధానం!
ఈ సందర్భంగా మీడియా ఆమెవద్ద రాజకీయ రంగప్రవేశం గురించి.. వైసీపీ నుంచి ఎంపీగా పోటీచేసే విషయం గురించీ ప్రస్థావించింది.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలో అధికార పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో... ప్రధానంగా నరసాపురం లోక్ సభ స్థానం విషయంలో సీటు.. కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం కోసం అట్టిపెట్టారని అంటున్నారు. ఈ సమయంలో శ్యామలా కృష్ణరాజు స్పందించారు!
అవును... ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో అభ్యర్థుల ఎంపికలో అనేకరకాల పరిణామాలను పరిగణలోకి తీసుకుంటున్న వైఎస్ జగన్... మూడు లోక్ సభ స్థానాల్లోని అభ్యర్థుల ఎంపికలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గుంటూరు నుంచి సినీనటుడు అలీకి అవకాశం ఉండొచ్చని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో... రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి డైరెక్టర్ వీవీ వినాయక్ పోటీ చేసే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరోపక్క గతకొన్ని రోజులుగా నరసాపురం వైసీపీ లోక్ సభ అభ్యర్థిగా శ్యామలా కృష్ణంరాజు పోటీచేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ విపరీతంగా జరుగుతుంది. పైగా ఇప్పుడు ఆమె పశ్చిమగోదావరి జిల్లాకు రావడం.. మీడియాతో ఈ వార్తలపై అస్పష్టంగా స్పందించడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది.
దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి వెస్ట్ గోదావరిలో ఉన్నారు. కృష్ణంరాజు జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో భారీ ఎత్తున మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా ఆమెవద్ద రాజకీయ రంగప్రవేశం గురించి.. వైసీపీ నుంచి ఎంపీగా పోటీచేసే విషయం గురించీ ప్రస్థావించింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన సమాధానం ఆసక్తిగా మారింది.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసే విషయంపై స్పందించిన శ్యామలా కృష్ణంరాజు... "తాను కృష్ణంరాజు గారి దాతృత్వ కోరికలను నెరవేర్చడానికి వచ్చాను. ఈ కార్యక్రమం పూర్తయ్యాక రాజకీయ ప్రవేశంపై మీరు అడిగే ప్రశ్నలకు కచ్చితంగా క్లారిటీ ఇస్తాను.." అని అన్నారు. దీంతో... శ్యామలాదేవి రాజకీయ రంగప్రవేశంపై ఊహాగాణాలు మరింతగా జోరందుకున్నాయి.
ఆమెకు రాజకీయాలపై ఆసక్తి లేనిపక్షంలో... స్పష్టంగా ఆ విషయాన్ని వెల్లడించేవారు.. అలా కాకుండా సరైన సమయం వచ్చినప్పుడు స్పష్టత ఇస్తాను అని చెప్పడంతో ఆమె వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా పోటీచేసే అవకాశాలున్నాయనే ఊహాగణాలు మరింత జోరందుకున్నాయి.
కాగా... గత ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా పోటీచేసిన రఘురామ కృష్ణంరాజు... గెలిచిన అతికొద్ది కాలంలోనే ఆ పార్టీకి రెబల్ గా మారిన సంగతి తెలిసిందే! నాటి నుంచి నరసాపురం లోక్ సభ నుంచి వైసీపీ అభ్యర్థి ఏవరా అనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయలో గతకొంతకాలంగా శ్యామలా కృష్ణరాజు పేరు ప్రధానంగా వినిపిస్తుంది!!