సిలికాన్ సిటీలో దారుణం... రాత్రంతా రోడ్లపై ప్రత్యక్ష నరకం!
అవును... బెంగళూరులో బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
సిలికాన్ సిటీ బెంగళూరులో బుధవారం రాత్రి కాళరాత్రిగా మారింది. సాయంత్రం ఆఫీసు అయిన తర్వాత ఇంటికి బయలుదేరిన వాళ్లు అర్ధరాత్రి అయినా ఇంటికి చేరుకోలేకపోయారు. ఇంతకాలం పుస్తకాల్లో చదివిన, సినిమాల్లో చూసిన నరకాన్ని ప్రత్యక్షంగా నడిరోడ్డుపై చూసేశారన్నా అతిశయోక్తి కాదన్నట్లుగా గడిపారు. దీనికంతటికీ వర్షం.. దాని ఫలితంగా జరిగిన ట్రాఫిక్ జామే కారణం కావడం గమనార్హం.
అవును... బెంగళూరులో బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవడంతో పలుప్రాంతాల్లో రోడ్లపై చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. మరోపక్క కొన్ని చోట్ల వర్షపునీరు రోడ్లపై నిలిచిపోయింది. దీంతో రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి.
ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ వెంబడి ఉన్న టెక్ హబ్ లో నభూతో న భవిష్యత్ అన్న స్థాయిలో ట్రాఫిక్ జాం నెలకొంది. మరికొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ గ్రిడ్ లాక్ ఏర్పడింది. ఫలితంగా గంటల కొద్దీ రోడ్ల మీదే గడపాల్సి వచ్చింది. కనీసం కారు డోర్ కూడా తీయలేని స్థాయిలో ట్రాఫిక్ జాం ఏర్పడింది.
అయితే ఈదురుగాలులతో కూడిన వర్షం, ఫలితంగా రోడ్లపై పడిన చెట్లే కాకుండా... కొన్ని మార్గాల్లో మెట్రో కారిడార్ నిర్మాణం ఉండటం, అలాంటి చోట రోడ్లపై గుంతలు ఏర్పడటం వంటివి కూడా ఈ స్థాయి ట్రాఫిక్ జాం కి కారణం అని చెబుతున్నారు. ఇదే సమయంలో మెట్రో నిర్మాణసామాగ్రితో సగం రోడ్లు నిండిపోయాయని అంటున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... ఈ వర్షం, ట్రాఫిక్ జాం ప్రభావం నోవా షోపైనా పడిందని తెలుస్తుంది. అవును.. ట్రాఫిక్ జాం ఎఫెక్ట్ వల్ల ఇంటర్నేషనల్ స్టాండప్ కమేడియన్ ట్రెవర్ నోవా షోను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కారణం... ఆయన కూడద ఔటర్ రింగ్ రోడ్ పై ఏర్పడిన భారీ ట్రాఫిక్ జాం లో ఇరుక్కుపోయ్యాడు. దీంతో షోని క్యాన్సిల్ చేశారు నిర్వాహకులు.