సిమ్‌ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా.. కొత్త నిబంధనలు ఇవే!

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్‌ నేరగాళ్లు కూడా అనేక మోసాలకు పాల్పడుతున్నారు

Update: 2023-09-05 09:15 GMT

మన మొబైల్‌ ఫోన్లు పనిచేయాలంటే సిమ్‌ కార్డులు ఉండాల్సిందే. ఒక్కో వ్యక్తి తమ అవసరాల కోసం ఒకటికి మించి సిమ్‌ కార్డులను ప్రస్తుతం వినియోగిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార అవసరాలకు ఒక సిమ్, కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం అంటే పర్సనల్‌ వ్యవహారాల కోసం మరో సిమ్‌ వినియోగించడం సర్వసాధారణం అయిపోయింది.

మరోవైపు సిమ్‌ కార్డుల జారీలోనూ మోసాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్‌ నేరగాళ్లు కూడా అనేక మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు వినియోగదారులు తమకు బదులుగా వేరే వారి ఆధార్‌ కార్డులను వినియోగించి సిమ్‌ కార్డులను పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిబంధనలను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో సిమ్‌ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనల ప్రకారం సిమ్‌ కార్డులను విక్రయించే దుకాణాలు మునుపటి కంటే కూడా రానున్న రోజుల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

కొత్త రూల్స్‌ ప్రకారం... ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి టెలికామ్‌ ఆపరేటర్లు రిజిస్టర్డ్‌ డీలర్ల ద్వారా మాత్రమే సిమ్‌ కార్డులను విక్రయించాల్సి ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే రూ. 10 లక్షలు జరిమానా విధిస్తారు.

అలాగే సిమ్‌ కార్డులను విక్రయించే ఎయిర్‌ టెల్, జియో వంటి పెద్ద టెలికామ్‌ కంపెనీలు కూడా తప్పకుండా తమ సిమ్‌ కార్డ్‌ లను విక్రయించే దుకాణాలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆ దుకాణాలు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నాయో, లేదో పరిశీలించాల్సి ఉంటుంది.

ఇంకోవైపు పోలీసులు కూడా పటిష్టమైన భద్రత చర్యల్లో భాగంగా అస్సాం, కాశ్మీర్‌ వంటి కొన్ని ప్రదేశాలలో కొత్త సిమ్‌ కార్డ్‌ లను విక్రయించే దుకాణాలను తనిఖీ చేస్తారు. సమస్యాత్మక ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల్లోనూ పోలీసుల తనిఖీలు చేపట్టాలి.

ఇక వినియోగదారులు పరంగా కొత్త సిమ్‌ కార్డుని కొనుగోలు చేయాలన్నా నిబంధనలు పాటించాల్సిందే. అంతేకాకుండా పాత సిమ్‌ కార్డు పోయినప్పుడు, అది పనిచేయనప్పుడు ఖచ్చితంగా వివరణాత్మక ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

దీనివల్ల తప్పుడు వ్యక్తులు ఆ నంబర్‌ తో సిమ్‌ కార్డులు పొందలేరు. ప్రభుత్వం తేనున్న ఈ కొత్త రూల్స్‌ సిమ్‌ కార్డులకు భద్రత చేకూరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా మోసగాళ్ల భారీ నుంచి కూడా కాపాడుకోవచ్చని అంటున్నారు.

Tags:    

Similar News