గద్దర్‌.. మాట నిలుపుకున్న సీఎం రేవంత్‌!

అయితే విప్లవ కవిగా గద్దర్‌ సేవలను తగు రీతిలో గుర్తించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కంకణం కట్టుకున్నారు

Update: 2024-01-31 07:04 GMT

ప్రజాయుద్ధనౌకగా పేరుగడించిన గద్దర్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో మావోయిస్టుగా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన గజ్జె కట్టి విప్లవ గీతాలు ఆలపించినా అది గద్దర్‌ కే చెల్లు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు గద్దర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే ఎన్నికలకు ముందే ఆయన కన్నుమూశారు. దీంతో గద్దర్‌ కుమార్తె వెన్నెలకు కాంగ్రెస్‌ పార్టీ కంటోన్మెంట్‌ అసెంబ్లీ సీటును కేటాయించింది. అయితే ఆమె ఓడిపోయారు.

అయితే విప్లవ కవిగా గద్దర్‌ సేవలను తగు రీతిలో గుర్తించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కంకణం కట్టుకున్నారు. గద్దర్‌ మరణించిన వెంటనే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లోని హుస్సేన్‌ సాగర్‌ ఒడ్డున ట్యాంక్‌ బండ్‌ పై గద్దర్‌ విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

తద్వారా సీఎం రేవంత్‌ రెడ్డి తాను ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. హుస్సేన్‌ సాగర్‌ ఒడ్డున ట్యాంక్‌ బండ్‌ వద్ద గద్దర్‌ విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గద్దర్‌ విగ్రహం ఏర్పాటుకు ట్యాంక్‌ బండ్‌ లేదా సమీపంలోని స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం రెవెన్యూ శాఖకు సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది.

స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా గద్దర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తుండటంతో అతి త్వరలోనే విగ్రహ ఏర్పాటు సాకారం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌ సభ ఎన్నికలకు ముందు ఇది కాంగ్రెస్‌ పార్టీకి మేలు చేస్తుందని అంటున్నారు. రేవంత్‌ మాట ఇస్తే నిలుపుకుంటారనే పేరును ఇప్పటికే ఆయన తెచ్చుకున్నారు. అధికారంలోకి వచ్చిన రెండో నెలలోపే గద్దర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసినవారి కుటుంబాలకు ఆర్థిక సాయం, డీఎస్పీ ఉద్యోగం పోగొట్టుకున్న నళినికి, కీలక పాత్రధారి ప్రొఫెసర్‌ కోదండరాంకు తదితరులకు రేవంత్‌ రెడ్డి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే నళినికి ఉద్యోగం ఇస్తామని భరోసా ఇవ్వగా తనకు ఆసక్తి లేదని ఆమె చెప్పారు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. ఆయనను మంత్రిని కూడా చేస్తారని టాక్‌ నడుస్తోంది. ఇప్పుడు ట్యాంక్‌ బండ్‌ వద్ద గద్దర్‌ విగ్రహం ఏర్పాటు వంటి అంశాలతో రేవంత్‌ రెడ్డి పరిపాలనలో మరింత ముందుకు దూసుకుపోతున్నారు.

Tags:    

Similar News