డబ్బుల కోసం వధూవరులుగా మారిన అన్నాచెల్లెళ్లు!

అవును... ఉత్తరప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకాన్ని ఉపయోగించుకోవడానికి అన్నాచెల్లెళ్లు వివాహం చేసుకున్నారనే ఘటన తెరపైకి వచ్చింది.

Update: 2024-10-08 03:45 GMT

డబ్బు మనిషితో ఎంతటిపనైనా చేయిస్తుందని అంటుంటారు. తాజాగా ఆ మాటకు బలం చేకూర్చే ఘటన ఒకటి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా డబ్బుల కోసం ఓ యువకుడు తన సొంత చెల్లిని వివాహం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

అవును... ఉత్తరప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకాన్ని ఉపయోగించుకోవడానికి అన్నాచెల్లెళ్లు వివాహం చేసుకున్నారనే ఘటన తెరపైకి వచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులకు మద్దతు ఇవ్వడం కోసం రూపొందించిన ఈ పథకం ఈ స్థాయిలో దుర్వినియోగం అవుతుందా అనే చర్చకు బలం చేకూర్చింది.

దీంతో... ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం మోసగాళ్లకు అడ్డాగా మారిందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ పథకం కింద వివాహిత జంటలకు గృహోపకరణాలు, రూ.35,000 నగదు మంజూరు చేస్తారు. అయితే మహారాజ్ గంజ్ లోని లక్ష్మీపూర్ బ్లాక్ లో జరిగిన ఈ ఉదంతం దోపిడీ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుందని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... మార్చి 5న 38 జంటలు ప్రభుత్వ సామూహిక వివాహ కార్యక్రమం ద్వారా ఏకమయ్యాయి. ఈ సమయంలో ఈ పథకం ప్రయోజనాలు క్లెయిం చేయడానికి ఒక సంవత్సరం ముందే వివాహం చేసుకున్న మహిళను మళ్లీ వేడుకలో పాల్గొనమని ఒప్పించారు మధ్యవర్తులు.

ఈ సమయంలో ఆమెకు ఉద్దేశించిన వరుడు కనిపించకపోవడంతో.. ఆశ్చర్యకరంగా అతని స్థానంలో ఆ మహిళ సోదరుడిని ఒప్పించారు. అయితే ఈ మోసానికి సంబంధించిన వార్త అధికారులకు తెలిసింది. దీంతో... అధికారులు వేగంగా చర్యలకు ఉపక్రమించారు.

ఇందులో భాగంగా... పెళ్లి సమయంలో ప్రభుత్వం అందింఛిన వస్తువులు, ఆర్థిక సహాయాన్ని తిరిగి పొందేందుకు లక్ష్మీపూర్ బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఆ మహిళ ఇంటికి అధికారులను పంపించారు. ఈ అక్రమం వెలుగులోకి వచ్చిన తర్వాత వారికి ఇచ్చిన అన్ని ప్రయోజనాలనూ జప్తూ చేశారని అంటున్నారు.

Tags:    

Similar News