సిస్టర్ సెంటిమెంట్.. అప్పుడు సబిత.. ఇప్పుడు సీతక్క

తాజాగా సీతక్క సెంటిమెంట్ పుణ్యమా అని కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Update: 2023-12-04 12:00 GMT

మిగిలిన రంగాల ప్రముఖులకు ఏ రీతిలో అయితే సెంటిమెంట్లు ఉంటాయో.. అందుకు వంద రెట్లు ఎక్కువగా రాజకీయ నేతలకు ఉంటాయి. ఎవరిదాకానో ఎందుకు? దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డినే తీసుకుంటే.. ఆయనకు ఏది మొదలుపెట్టాలన్నా చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం నుంచి మొదలుపెట్టటం తెలిసిందే. ఆయన చేపట్టిన పాదయాత్ర ట్రెండ్ సెట్టర్ గా నిలవటమే కాదు.. తర్వాత కాలంలో రాజకీయ నేతల గెలుపునుకు అదో బాటగా నిలిచిందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

అప్పట్లో వైఎస్ పాదయాత్రను చేవెళ్ల చెల్లెమ్మ సెంటిమెంట్ తో షురూ చేసి.. విజయవంతంగా పూర్తి చేయటం.. కొద్ది కాలానికే ముఖ్యమంత్రి కావటం తెలిసిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సైతం తాను చెల్లెలుగా భావించే సీతక్క సెంటిమెంట్ చూస్తే.. వైఎస్ ఎపిసోడ్ గుర్తుకు రాక మానదు. ఈ ఏడాది ఫిబ్రవరి ఆరో తేదీన ములుగు నియోజకవర్గం నుంచి సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి రేవంత్ పాదయాత్ర చేయటం.. అదెంతలా వర్కువుట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

2004లో వైఎస్ అధికారంలోకి రావటానికి ముందు ఆయన చేపట్టిన పాదయాత్ర మాదిరే..రేవంత్ కూడా చేశారని చెప్పాలి. అందుకుతగ్గట్లే పాదయాత్ర ఎఫెక్టు కావొచ్చు.. సిస్టర్ సెంటిమెంట్ కావొచ్చు.. మొత్తంగా రేవంత్ ముఖ్యమంత్రి కానున్న సంగతి తెలిసిందే. రేవంత్ పాదయాత్ర చేసిన సమయంలోనూ సీతక్క ఆయన వెంట నడిచారు. అంతేకాదు. రాహుల్.. ప్రియాంకలు చేపట్టిన యాత్రల సందర్భంగానే సీతక్క సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు.

తాజాగా సీతక్క సెంటిమెంట్ పుణ్యమా అని కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చెల్లెమ్మ సెంటిమెంట్ కు తగ్గట్లే నాడు సబితా ఇంద్రారెడ్డికి మంత్రిపదవిని కట్టబెట్టటం ద్వారా వైఎస్ ఆమె రుణాన్ని తీర్చుకుంటే.. తాజాగా అదే తరహాలో రేవంత్ కూడా వ్యవహరిస్తారని చెబుతున్నారు. నిజాయితీకి నిలువెత్తు రూపంలా అభివర్ణించే సీతక్కను మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెబుతున్నారు. అంతేకాదు.. సీతక్కకు కీలక శాఖను అప్పజెప్పే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. కేబినెట్ లోకి సీతక్క ఖాయంగా వస్తుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా మరో అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

సీతక్కను సోదరిగా భావించే రేవంత్.. వేం నరేందర్ రెడ్డిని తన సోదరుడిగా రేవంత్ భావిస్తుంటారని చెబుతారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్.. తన కేబినెట్ లో వేం రెడ్డికి సముచిత స్థానాన్ని కల్పించే వీలుందని చెబుతున్నారు. ఏమైనా.. ఈ ఇద్దరి విషయంలో రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News