ఒకేసారి రాజకీయ తెర మీద అన్న గారి కూతుళ్ళు...!
మొత్తం మీద చూస్తే ఒకే సమయంలో అక్క చెల్లెళ్ళు ఇద్దరూ వైసీపీ ప్రభుత్వం మీద రాజకీయ పోరాటం చేయడం ఆశ్చర్యంగా ఆసక్తికరంగా ఉంది అంటున్నారు.
ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు అన్నీ పరిత్యజించాను అని ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పుకొచ్చారు. ఆయన తన కుమారుడు హరిక్రిష్ణను సైతం రాజకీయంగా ప్రోత్సహించలేదు. అలాగే పార్టీ పుట్టుక తరువాత కీలక పాత్ర పోషించిన పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా మంత్రిగా తీసుకోలేదు.
అలా బంధువులను దూరం పెట్టే 1985 వరకూ ప్రభుత్వాన్ని నడిపారు. 1984లో నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు తరువాతనే ఆయన అల్లుళ్ళను ఇద్దరినీ చేరదీసారు. అపుడే పెద్దల్లుడికి మంత్రి పదవి దక్కింది. చిన్నల్లుడు చంద్రబాబూ పార్టీ పదవి దక్కింది. ఆ తరువాత నా రాజకీయ వారసుడు బాలయ్యే అంటూ 1987లో మదనపల్లిలో ఎన్టీయార్ ప్రకటన చేయడం జరిగింది.
అయితే ఎంత చేసినా ఆయన అల్లుళ్ళు మాత్రమే రాజకీయ తెర మీద కనిపించారు కానీ కుమారులు కుమార్తెలు ఎపుడూ రాలేదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల్లో తగ్గిన తరువాత ఆయన సతీమణిగా పురంధేశ్వరి రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా రెండు సార్లు ఎంపీ అయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేసారు.
ఇపుడు బీజేపీలో ఆమె రాష్ట్ర అధ్యక్షురాలిగా కీలకమైన భూమిక పోషిస్తున్నారు. ఇక చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అయితే భర్త చాటు గానే ఉంటూ వచ్చారు. అయితే చంద్రబాబుని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో ఉంచడంతో ఆమె గత పదిహేను రోజులుగా జనంలో ఉంటున్నారు. ఏకంగా రాజమండ్రికి మకాం మార్చేశారు.
ప్రతీ రోజూ తమ క్యాంప్ ఉన్న ప్రాంతానికి వస్తున్న క్యాడర్ ని ఉద్దేశించి ఆమె ప్రసంగాలు చేస్తున్నారు. తన భర్త చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని గట్టిగానే సమర్ధించుకుంటున్నారు. మాకు 371 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము అవసరమా అంటూ ఆమె హెరిటేజ్ లోతన వాటా జస్ట్ రెండు సాతం అమ్ముకుంటే నాలుగు వందల కోట్లు వస్తాయని చెప్పి పవర్ ఫుల్ పంచ్ నే విసిరారు. తాము ప్రజల సొమ్ముని ఆశించే వారం కామని ఆమె పౌరుషంగానే డైలాగులు చెబుతున్నారు.
మొత్తానికి ఒక్క మాట కూడా మాట్లాడడానికి ఆలోచించే భువనేశ్వరి ఇపుడు మైక్ పట్టుకుని మాట్లాడుతున్నారు భర్త జైలులో ఉన్న వేళ క్యాడర్ తో ఉంటూ ఆమె ప్రభుత్వం మీద వరస విమర్శలు చేస్తున్నారు మీడియాను కూడా ఫేస్ చేస్తున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి ఒక వైపు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ వైసీపీ సర్కార్ మీద ఘాటైన విమర్శలు చేస్తూ ఉంటే ఆమె చెల్లెలు భువనేశ్వరి కూడా వైసీపీ ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఒకే సమయంలో అక్క చెల్లెళ్ళు ఇద్దరూ వైసీపీ ప్రభుత్వం మీద రాజకీయ పోరాటం చేయడం ఆశ్చర్యంగా ఆసక్తికరంగా ఉంది అంటున్నారు. ఎన్టీయార్ కుమార్తెలుగా ఏనాడూ రాజకీయాల వైపు తొంగి చూడని ఈ నందమూరి ఆడపడుచులు ఇపుడు రాజకీయ పోరాటానికి సిద్ధపడడం అంటే మారిన కాలమే వారిని ఇలా నడిపిస్తోంది అనుకోవాలని అంటున్నారు.