మంత్రి సీతక్క ఇలా బుక్కయిందే !

కేంద్రం మావోలను నిర్మూలిస్తామని చెబుతుండగా సీతక్క ఎన్ కౌంటర్ లో మరణించిన వారిని పరామర్శించడం చర్చకు దారి తీస్తున్నది.

Update: 2024-04-26 05:13 GMT

విప్లవపంథాను వీడి అడవిబాట నుండి జనం బాటపట్టిన ప్రస్తుత తెలంగాణ మంత్రి ధనసరి అనసూయ ఆలియాస్ సీతక్క దాదాపు రెండు దశాబ్దాలు నక్సలైట్ గా కొనసాగారు. అనంతరం పోలీసులకు లొంగిపోయిన ఆమె ఆ తర్వాత న్యాయవాద విద్యను అభ్యసించింది. 2012లో పీహెచ్ డీ మొదలుపెట్టి 2022లో పూర్తి చేసి ఉస్మానియా యూనివర్శిటీ నుండి పట్టాను అందుకుంది. 2004 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పొడెం వీరయ్య చేతిలో ఓడిపోయింది.

2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ నుండి పోటీ చేసి అదే పొడెం వీరయ్యపై గెలిచి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టింది. 2014 వరుసగా బీఆర్ఎస్ అభ్యర్థి ఆజ్మీరా చందులాల్ చేతిలో ఓడిపోయిన ఆమె 2018లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచింది. గత ఏడాది వరసగా రెండో సారి గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది.

రాజ్యాంగబద్దంగా మంత్రి పదవిలో ఉన్న మంత్రి సీతక్క ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో జరిగిన పోలీసు ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు నాయకుడు సుధాకర్‌ అలియాస్‌ శంకరన్న గ్రామానికి మంత్రి వెళ్లి మావోయిస్టులకు నివాళులర్పించడం వివాదానికి తెరలేపింది.

మావోయిస్టులకు మద్దతునిచ్చేలా సీతక్క కార్యకలాపాలు ఉన్నాయని, మంత్రి పదవిలో ఉన్న ఆమె ప్రభుత్వ రహస్యాలను మావోయిస్టులకు చేరవేసే అవకాశం ఉందని యాంటి టెర్రరిజం ఫోరం చైర్మన్‌ డాక్టర్‌ రావినూతల శశిధర్‌ గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ, రాష్ట్రపతికి కూడా మంత్రి సీతక్క వ్యవహారశైలిపై లేఖలు రాసినట్టు వెల్లడించాడు. కేంద్రం మావోలను నిర్మూలిస్తామని చెబుతుండగా సీతక్క ఎన్ కౌంటర్ లో మరణించిన వారిని పరామర్శించడం చర్చకు దారి తీస్తున్నది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

Tags:    

Similar News