గెలిచే పార్టీ ఏదో శాసించేది సోషల్ మీడియానేనా?
టెక్నాలజీ పుణ్యమాని స్మార్ట్ ఫోన్లు, 5జీ వేగంతో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేశాయి.
ఒకప్పుడు ఏదైనా సమాచారం తెలుసుకోవడానికి, వాస్తవాలను నిర్ధారించుకోవడానికి టీవీలు, పత్రికలపైనే అంతా ఆధారపడేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. టెక్నాలజీ పుణ్యమాని స్మార్ట్ ఫోన్లు, 5జీ వేగంతో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేశాయి. క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా సమాచారం అందరికీ తెలుస్తోంది.
ముఖ్యంగా సోషల్ మీడియా ప్రజల జీవితాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయిన పత్రికలు, టీవీలకంటే సోషల్ మీడియాపైనే అంతా ఆధారపడుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చినదాన్నే నిజంగా నిర్ధారించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు పంట పండుతోంది.
ప్రస్తుతం మనదేశంలో పార్లమెంటుకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. దీంతో అన్ని పార్టీలు ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లపైనే ఆధారపడుతున్నాయి. ఏ పార్టీ సోషల్ మీడియా విభాగం బలంగా ఉంటే ఆ పార్టీకి అంతగా విజయావకాశాలు ఉంటాయనే భావన వ్యక్తమవుతోంది.
2014లో ఎన్నికల్లోనే సోషల్ మీడియా ప్రభావం మొదలైంది. ఆ ఎన్నికల్లో సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం వల్లే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని అంటున్నారు.
మనదేశంలో 820 మిలియన్ల మంది ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారని గణాంకాలు చెబుతున్నారు. ఇందులో దాదాపు సగానికంటే ఎక్కువ అంటే 442 మిలియన్ల మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారని అంటున్నారు. మనదేశంలో 1జీబీ డేటా పొందడానికి కేవలం రూ.13 ఖర్చు చేస్తే చాలు. ప్రపంచంలో ఇంటర్నెట్ డేటా అతి తక్కువ ఖర్చుకే అందుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.
దీంతో మనదేశంలో ఇంటర్నెట్ వాడుతున్న 820 మిలియన్ల మంది ప్రజలను ఆయా పార్టీలు ప్రభావితం చేస్తున్నాయి. పెద్ద పార్టీల నుంచి చిన్న పార్టీల వరకు ఎక్స్, ఫేస్ బుక్, ఇనస్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్,
షేర్ చాట్ తదితర సోషల్ మీడియా మాధ్యమాల్లో ఖాతాలను కలిగి ఉన్నాయి. ఆయా పార్టీలను, పార్టీల అధినేతలు, ముఖ్య నేతలను మిలియన్ల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు ఫాలో అవుతున్నారు. దీంతో వారిని ఆకట్టుకోవడానికి రీల్స్, షార్ట్స్, వీడియోలు, పోస్టుల రూపంలో ఆయా పార్టీలు, నేతలు చేరువ అవుతున్నారు.
తమ పార్టీల కార్యకలాపాలను, కార్యక్రమాలను, తమ ప్రభుత్వాల పథకాలు, ప్రభుత్వ విజయాలను చెప్పుకోవడానికి అన్ని పార్టీలు సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో అన్ని పార్టీలు పోడోకాస్ట్, రీల్స్, షార్ట్స్, యూట్యూబ్ వీడియోలు, ఇన్ ఫ్లుయెన్సర్లతో భాగస్వామ్యం, ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగులు, ఫేస్ బుక్ ఇంటర్వ్యూలు తదితరాల ద్వారా డిజిటల్ క్యాంపెయిన్ చేస్తున్నాయి.
మనదేశంలో 87 శాతం మంది వార్తలను తెలుసుకోవడానికి యూట్యూబ్ పైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ 2023 నుంచి ఇప్పటివరకు 1.2 మిలియన్ డాలర్లు యూట్యూబ్ లో యాడ్స్ ప్రచారానికి వెచ్చించింది.
మనదేశంలో 229 మిలియన్ల మందికి ఇనస్టాగ్రామ్ ఖాతాలున్నాయి. 535 మిలియన్ల మంది వాట్సాప్ వాడుతున్నారు. 315 మిలియన్ల మంది ఫేస్ బుక్ వినియోగిస్తున్నారు. 462 మిలియన్ల మంది యూట్యూబ్ వినియోగదారులు ఉన్నారు. దీంతో రాజకీయ పార్టీలు వీరిని లక్ష్యంగా చేసుకున్నారు. తమ పార్టీల డిజిటల్ ప్రచారం, తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలు, కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వాలు అమలు చేసిన పథకాల గురించి వివరిస్తున్నారు. అలాగే ప్రత్యర్థి పార్టీల నేతలు నోరుజారి మాట్లాడిన వ్యాఖ్యల వీడియోలను వైరల్ చేస్తున్నారు.
అలాగే తటస్థులుగా ఉండే సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్లు భారత రాజకీయాలను, ప్రజలను బలంగా ప్రభావితం చేస్తున్నారు. వీరికున్న ఫాలోవర్లను బట్టి ఎలైట్, మెగా, మాక్రో, మైక్రోగా సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్లను రాజకీయ పార్టీలు వర్గీకరిస్తున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ఒక పార్టీకి అనుకూలంగా తిప్పడంలోనూ, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడంలోనూ సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
దీంతో రాజకీయ పార్టీలు సైతం సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్లపై కన్నేశాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్), ఇనస్ట్రాగామ్, షేర్ చాట్ , యూట్యూబ్ తదితర సోషల్ మీడియా మాధ్యమాల్లో ఖాతాలు కలిగి ఉండి, పెద్ద ఎత్తున ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఓటర్లను ప్రభావితం చేయడంతోపాటు రాజకీయ పరమైన చర్చలను సోషల్ మీడియాలో రేకెత్తించేలా చేస్తున్న వీరిపై కన్నేశాయి.
ఎవరైనా ఏదొక సోషల్ మీడియా ఖాతాను కలిగి ఉండి.. చెప్పుకోదగిన సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉంటే వారిపై ఆయా రాజకీయ పార్టీలు వల వేస్తున్నాయి. వారికి ప్రతి నెలా జీతంలాగా లేదా ఒకే భారీ మొత్తాన్ని చెల్లించి తమ వైపుకు తిప్పుకుంటున్నాయి. తమ పార్టీలకు లబ్ధి చేకూరేలా వారితో పోస్టులు పెట్టిస్తున్నాయి. దీంతో ఎంతో కాలం నుంచి ఆయా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవుతున్నవారు ఇన్ ఫ్లుయెన్సర్ల ప్రభావానికి లోనవుతున్నారు.
ఎన్నికల్లో గెలుపొందడంలో ఒక్క ఓటు కూడా కీలకమే. 5, 10 ఓట్ల తేడాతోనూ ఓడిపోయినవాళ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఏ రిస్కూ తీసుకోదలుచుకోలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్ల ప్రాధాన్యతను రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సుర్లు తాము పెట్టే ఒక్క వీడియో లేదా పోస్టుకే 50 వేల వరకు సంపాదిస్తున్నారని చెబుతున్నారు.
ఎన్నికల సీజన్ రెండు మూడు నెలల్లోనే సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్లు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. తక్కువ ఫాలోవర్లు ఉన్నవారు 50 వేల రూపాయల నుంచి లక్ష వరకు పొందుతున్నారు. మరికొందరు రూ.5 లక్షల వరకు అందుకుంటున్నారు. 2024 చివరి నాటికి ఇండియా సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్ మార్కెట్ విలువ 289 మిలియన్ డాలర్లకు, 2026 నాటికి 400 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి.
పార్టీలు తమ సందేశాలను పంపడానికి ఒకప్పుడు సంపద్రాయ మీడియా అయిన పత్రికలు, టీవీపైనే ఆధారపడేవారు. ఇప్పుడు వారు సోషల్ మీడియాపైన ఆధారపడుతున్నారు.
సోషల్ మీడియా ద్వారా ఆయా రాజకీయ పార్టీలకు మేలు జరుగుతున్నా మరోవైపు అంతేస్థాయిలో వీటివల్ల నష్టం కూడా జరుగుతుందని అంటున్నారు. తప్పుడు వీడియోలు, డీప్ ఫేక్ తో తప్పుడు వీడియోలు, విద్వేషపూరిత ప్రసంగాలు, అసభ్య వ్యాఖ్యలతో కూడిన వీడియోలు, అసత్యాలు, అబద్దాలతో కూడిన వీడియోలు వంటి వాటి ద్వారా ప్రజలు ప్రభావితమయ్యేందుకు అవకాశాలున్నాయని ఆందోళన చెందుతున్నవారూ ఉన్నారు.