సోష‌ల్ మీడియా బంద్‌.. హ‌ద్దు మీరితే వేటే!!

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు, ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Update: 2023-11-29 04:11 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాను న‌మ్ముకుందామ‌ని అనుకున్న పార్టీలకు, నేత‌ల‌కు భారీ ఎదురు దెబ్బ‌త‌గిలింది. సోషల్‌ మీడియాలో ఎన్నికల ప్రచారం నిషిద్ధమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్‌ మీడియాలో అవకాశముందని స్పష్టం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు, ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దని పేర్కొన్నారు.

‘‘టీవీలు, రేడియోలు, కేబుల్‌ నెట్‌వర్క్‌ల్లో ప్రచారం నిషిద్ధం. ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదు. పోలింగ్‌ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్‌పోల్స్‌ నిషేధం. ఎన్నికల విధుల్లో ఉన్న 1.48 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,094 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌. ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలున్న 7,571 ప్రాంతాల్లో బయట కూడా వెబ్‌ కాస్టింగ్‌. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. పోలింగ్‌ కేంద్రానికి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు నిషేధం`` అని తెలిపారు. కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు తనిఖీల్లో రూ.737 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామ‌న్నారు.

పోలింగ్‌ రోజున(30వ తేదీ) రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా స‌హ‌క‌రించాల‌ని ఆదేశించారు. గత ఎన్నికల వేళ కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయని.. ఈసారి చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామ‌న్నారు.

Tags:    

Similar News