వరుసగా ఐదుసార్లు ఓడినా మళ్లీ టికెట్!
టీడీపీ అధినేత చంద్రబాబు తాజా జాబితాలో 13 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే
టీడీపీ అధినేత చంద్రబాబు తాజా జాబితాలో 13 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సీటు లభించడం హాట్ టాపిక్ గా మారింది.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లిలో వరుసగా ఐదుసార్లు ఓడిపోయారు. ఆయన చివరిసారి ఆ నియోజకవర్గం నుంచి 1999లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మధ్యలో 2012లో కోవూరులో జరిగిన ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసి పరాజయం చెందారు.
అయినప్పటికీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోమారు సీటు దక్కించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి వరుసగా రెండు లేదా మూడుసార్లు ఓడిన నేతలకు ఈసారి టికెట్లు ఇవ్వవద్దని టీడీపీ ఒక పాలసీగా పెట్టుకుంది. ఇదే విషయాన్ని టికెట్లు ఆశించిన పలువురు నేతలకు నారా లోకేశ్ చెప్పారు కూడా.
అయితే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి గట్టి అభ్యర్థులు లేకపోవడం, సామాజిక సమీకరణాలు, పార్టీకి అవసరాలు తదితర కారణాలతో ఈ నిబంధనను పక్కనపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే కోవలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా ఐదుసార్లు ఓడిపోయినా నెల్లూరు జిల్లాలో బలమైన రెడ్డి నేత కావడం, పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే ఉండటం, అధికార పార్టీపై విమర్శలు చేయడంలో బలమైన గొంతుక కలిగి ఉండటం తదితర కారణాలతో ఆయనకు తాజాగా సీటు ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నారు.
1994, 1999ల్లో గెలిచిన సోమిరెడ్డి.. చంద్రబాబు మంత్రివర్గంలో క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా, సమాచార ప్రసార శాఖల మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేశారు. 2014లో సైతం ఆయనకున్న అనుభవంతోనే వ్యవసాయ మంత్రిగా చంద్రబాబు అవకాశమిచ్చారు. 2014లో ఎమ్మెల్సీగా ఉండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రి పదవిని దక్కించుకోవడం విశేషం.
ఇప్పుడు కూడా పార్టీకి ఉన్న అవసరాలతోనే ఆయనకు సర్వేపల్లి నుంచి సీటు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. 1994, 1999ల్లో వరుసగా రెండుసార్లు సోమిరెడ్డి విజయం సాధించారు. ఇక 2004 నుంచి 2019 వరకు వరుసగా పరాజయం పాలయ్యారు.