సోనియాగాంధీ పర్యటన రద్దు వెనక ?!

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరుకావడం లేదు.

Update: 2024-06-01 07:35 GMT

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరుకావడం లేదు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో తెలంగాణ పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు ఏఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని ఆహ్వానించారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం సోనియా గాంధీ హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది.

కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సోనియా ఈ టూర్ విషయంలో తన వ్యక్తిగత వైద్యుడి సలహా కోరారు. సోనియా ఆరోగ్యం దృష్ట్యా ఈ ప్రయాణం మానుకుంటేనే మేలని వైద్యుడు చెప్పడంతో తెలంగాణ టూర్ ను ఆమె రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

పదేళ్ల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈసారి సోనియాను పిలిచి ఘనంగా సత్కరించాలని భావించారు. అయితే ఆమె హాజరుకావడం కష్టమేనని గతంలోనే వార్తలు వచ్చినా రెండురోజుల క్రితం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయినప్పటికీ మరోసారి ఆమె పర్యటన అనారోగ్యం కారణంగా రద్దయింది.

తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పు, తెలంగాణ రాష్ట్ర గీతం వంటి వివాదాల నేపథ్యంలో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగానే ఆమె పర్యటన రద్దయిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ వేడుకలకు సోనియాను ఆహ్వానించి ఘనంగా సత్కరించాలనుకున్న కాంగ్రెస్ నేతల ఆశలు నెరవేరలేదు.

Tags:    

Similar News