మోడీ ప్రత్యేక సమావేశాలకు ఎజెండా ఇచ్చిన సోనియా

ఎవరేం అనుకున్నాఫర్లేదు.. సంపూర్ణ మెజార్టీ ఉన్నతమ ప్రభుత్వం తాను అనుకున్న ఎజెండాకు తగ్గట్లే నడుచుకోవాలన్నట్లుగా ఉంటుంది మోడీ సర్కారు తీరు.

Update: 2023-09-07 04:51 GMT

తాను అనుకున్నదే తప్పించి.. ఎదుటోళ్లు ఎంత ఏడ్చి మొత్తుకున్నా సరే.. కనీసం వాటి వంక చూసే ధోరణి మోడీ సర్కారులో అస్సలు లేదన్న విషయం తెలిసిందే. ఎవరేం అనుకున్నాఫర్లేదు.. సంపూర్ణ మెజార్టీ ఉన్నతమ ప్రభుత్వం తాను అనుకున్న ఎజెండాకు తగ్గట్లే నడుచుకోవాలన్నట్లుగా ఉంటుంది మోడీ సర్కారు తీరు. అందుకు తగ్గట్లే.. ఎజెండా ఏమిటో ప్రస్తావించకుండానే ఈ నెలలో ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ను ఏర్పాటు చేయటం తెలిసిందే. దీంతో.. దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన కీలక బిల్లును ప్రవేశ పెట్టటం కోసమే ప్రత్యేక సమావేశాలన్న చర్చ జోరందుకుంది.

ఇలాంటివేళ.. విపక్ష కాంగ్రెస్ పార్టీ కీలక నేత.. విపక్ష కూటమికి సంబంధించిన అగ్రనేతల్లో ఒకరైన సోనియాగాంధీ తాజాగా స్పందించారు. ఈ నెల 18 నుంచి 22 వరకు నిర్వహించే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు సంబంధించి పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి ఎజెండాను ప్రకటించకుండానే ప్రత్యేక భేటీని ఎందుకు నిర్వహిస్తున్నారంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి సోనియాగాంధీ ఒక లేఖ రాశారు. అందులో మోడీ సర్కారు తీరును తప్పు పట్టిన ఆమె.. త్వరలో నిర్వహించే ప్రత్యేక సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఆసక్తికర వాదనను వినిపించారు. ప్రత్యేక సమావేశాల్లో తొమ్మిది అంశాలపై చర్చ జరగాల్సిందేనని పట్టుపట్టారు. మణిపూర్ లో పెరిగిన హింస.. చైనాతో సరిహద్దుల వెంట కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.. అదానీ గ్రూప్ అవినీతి లావాదేవాలతో పాటు పలు సంచలన అంశాల్ని చర్చించేలా ఎజెండాను సిద్ధం చేయాలని ఆమె కోరుతున్నారు.

ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ఐదు రోజులు.. ప్రభుత్వ ఎజెండాపైనే చర్చ జరుగుతుందన్న సమాచారం తమకు వచ్చిందన్న సోనియా.. ప్రజాసమస్యలు.. ప్రాముఖ్యత నేపథ్యంలో తాము తప్పనిసరిగా చర్చలో పాల్గొంటామని పేర్కొంది. ఉభయ సభల్లో ఏ అంశాలపై చర్చ జరుపుతారో ముందే తెలపకుండా సెషన్ ను ప్రారంభించటంబహుశా ఇదే తొలిసారి కావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక సమావేశాల్ని తాము బాయ్ కాట్ చేయమని.. సభలో ఉండి సమస్యలపై పోరాడతామన్న ఆమె.. ప్రధాని మోడీకి రాసిన లేఖలో పలు అంశాల్నిప్రస్తావించారు.

ప్రత్యేక సమావేశాల్లో సోనియా కోరుతున్న చర్చ ఏయే అంశాల మీదనంటే..

1. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి.. ధరల పెరుగుదల.. నిరుద్యోగం అంశాలపైనా..

2. రైతులు.. రైతు సంస్థలు లేవనెత్తిన కనీస మద్దతు ధర అంశంతో పాటు ఇతర డిమాండ్ల పరిష్కార అంశాల మీదా..

3. అదానీ వ్యాపార లావాదేవీలపై దర్యాప్తు చేసేందుకు జేపీసీ ఏర్పాటు చేయాలి

4. మణిపూర్ ప్రజలు ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులు.. అక్కడి హింసపై

5. హర్యానా లాంటి రాష్ట్రాల్లో పెరుగుతున్న మత ఉద్రిక్తతల మీద చర్చ

6. భారత భూభాగాన్ని చైనా అక్రమించటం.. లద్ధాఖ్.. అరుణాచల్ ప్రదేశ్ లోని మన సరిహద్దుల్లో దేశ సార్వభహౌమాధికారానికి ఎదురైన సవాళ్లు

7. దేశ వ్యాప్తంగా కుల గణన

8. కేంద్ర.. రాష్ట్రాల మధ్య దిగజారుతున్న సంబంధాలపైనా..

9. విపత్తుల వేళ కొన్ని రాష్ట్రాల్లో చోటు చేసుకున్న వరదలు.. కొన్ని రాష్ట్రాల్లోని కరవు పరిస్థితులపైనా..

Tags:    

Similar News