బీఆర్ఎస్ నిరసనల మధ్యే కీలక బిల్స్ పాస్!

ఇక.. రాష్ట్ర అప్పుల మీద సైతం వాడివేడిగా చర్చ సాగింది. ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్ రావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల మధ్య వాగ్వివాదం జరిగింది.

Update: 2024-12-17 10:46 GMT

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి పలు బిల్లులు బీఆర్ఎస్ నిరసనల మధ్యే పాస్ అయ్యాయి. ఓ వైపు .. గులాబీ పార్టీ నేతలు నిరసనలు తెలుపుతున్నా వాటిని పట్టించుకోకుండా కీలక బిల్లులకు క్లియరెన్స్ ఇచ్చారు. దాంతో మూడు బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండానే క్లియర్ అయిపోయాయి.

తెలంగాణ ప్రభుత్వం కీలకంగా మూడు బిల్స్ తీసుకొచ్చింది. అందులో భాగంగా యూనివర్సిటీ సవరణ బిల్లు ఒకటి కాగా.. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ మరొకటి. స్పోర్ట్స్ పాలసీ బిల్లులు ఈ రోజు అసెంబ్లీలో పాస్ అయ్యాయి. ఒకేరోజు మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టిన ఆయా శాఖల మంత్రులు.. స్పీకర్ ఆమోదంతో వాటికి క్లియరెన్స్ తీసుకొచ్చారు.

మరోవైపు.. అసెంబ్లీ సమావేశం ప్రారంభం అయినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతల నిరసనలు కొనసాగాయి. లగచర్ల రైతుకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ బేడీలతో వచ్చిన నేతలు.. బ్లాక్ షర్ట్ ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇక.. రాష్ట్ర అప్పుల మీద సైతం వాడివేడిగా చర్చ సాగింది. ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్ రావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల మధ్య వాగ్వివాదం జరిగింది. నువ్వా నేనా అన్నట్లుగా విమర్శలు, ప్రతివిమర్శలతో ముందుకు సాగారు. గత ప్రభుత్వంలోని అప్పులను ఇరు నేతలు బయటపెట్టారు.

కాంగ్రెస్ చెప్తున్న లెక్కలకు.. తమ ప్రభుత్వం చేసిన అప్పులకు లెక్కలో పొంతన లేదని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. కానీ.. వాటికి భట్టి వివరణాత్మకంగా వివరించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకే ఇప్పటివరకు రూ.66 కోట్లు తీర్చామని వివరించారు. అవసరమైతే అప్పులపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.

ఇదిలా ఉండగా.. బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో స్పీకర్ ప్రసాద్ బీఆర్ఎస్ నేతలకు కీలక అప్పీల్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్స్‌కు మద్దతు తెలపాలని కోరారు. కానీ.. బీఆర్ఎస్ సభ్యులు మాత్రం వాటిని పట్టించుకోలేదు. అసలు ఆ మాటలు వినకుండా మరోసారి నినాదాలు కొనసాగించారు. ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం’ అంటూ నినదించారు. ‘రైతు చేతికి సంకెళ్లా..’ అంటూ ముక్తకంఠంతో నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ వీటిని పట్టించుకోకుండానే బిల్స్ చదువుతూ వాటికి ఆమోదం తెలిపారు.

Tags:    

Similar News