పుదుచ్చేరిని చూసైనా ఏపీ పాకులు పాఠం నేర్వరా..!
పుదుచ్చేరి(గతంలో పాండిచ్చేరి) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
పుదుచ్చేరి(గతంలో పాండిచ్చేరి) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాం తంగా ఉన్న ఈ రాష్ట్రానికి అసెంబ్లీ ఉంది. అంతేకాదు.. ఐదేళ్ల కోసారి ఎన్నికలు కూడా జరుగుతుంటాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా ఏర్పడతాయి. కానీ, ఏం లాభం.. ఎప్పుడో బ్రిటీష్ వారి పాలనా కాలం ముగిసిన తర్వాత.. అన్ని రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రం(కేంద్రపాలిత ప్రాంతాలన్నీ అంతే) భారత దేశ ప్రభుత్వం లో భాగం కాలేక పోయింది. దీంతో తర్వాత ఎప్పుడో విలీనం చేశారు.
ఈ నేపథ్యంలో ఇలాంటి రాష్ట్రాలకు సర్వాధికారాలు ఇవ్వకుండా. కేంద్రమే ఇక్కడ పెత్తనం చేస్తోందనే వాదన ఉంది. దీంతో పుదుచ్చేరికి కూడా.. రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ.. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. ప్రతి ఐదేళ్లలో రెండు సార్లు.. రాష్ట్ర హోదా కోరుతూ.. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తూనే ఉంది. కేంద్రం దీనిని ఆమోదించడం లేదు. అయినప్పటికీ.. పట్టువదల కుండా.. ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా సీఎం రంగస్వామి ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి.. గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపించింది.
కట్ చేస్తే.. అత్యంత చిన్న కేంద్ర పాలిత ప్రాంతమే తన హక్కుల కోసం.. తన హోదా కోసం ప్రయత్నా లు చేస్తున్నప్పుడు.. ఏపీకి ఏమైంది? అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. రాష్ట్ర విభజన చట్టానికి వచ్చే జూన్‌తో పదేళ్ల ఆయుర్ధాయం తీరిపోనుంది. అంటే.. ఆ తర్వాత.. అది చిత్తు కాయితంతో సమానం. మరి ఈలోపే.. ఆ విభజన చట్టంలోని అంశాలపై అసెంబ్లీలో తీర్మానం చేసైనా.. కేంద్రానికి పంపించి.. సాధించుకునే ప్రయత్నం చేయాలి కదా? అనేది ప్రశ్న.
అదేవిధంగా విభజన చట్టంలో చేర్చకపోయినా.. ప్రత్యేక హోదా విషయాన్ని పార్లమెంటులో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రస్తావించి.. హామీ ఇచ్చిన దరిమిలా.. ఈ విషయాన్ని కూడా ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని పదేపదే తీర్మానం చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల మనో భావాలకు ప్రాధాన్యం ఇచ్చి.. కేంద్రం దృష్టికి మరోసారి వినిపించాలి కదా! అనేది ప్రజాస్వామ్య వాదుల వాదన. కానీ ఆదిశగా ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు.
అంతేకాదు.. సీఎం జగన్, ఆయన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జిల్లాల విభజన.. కొత్త జిల్లాల ఏర్పాటుకు.. ఇప్పటి వరకు అధికారిక ముద్ర పడలేదు. దీనిని రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ ఆ పరిస్థితి లేదు. ఇక, దిశ చట్టాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. దానికీ కేంద్రం నుంచి అనుమతి లేదు. మరి ఇప్పటికైనా.. వీటితో పాటు ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలోనికీలక అంశాలను ప్రధానంగా తీసుకుని.. మళ్లీ మళ్లీ తీర్మానం చేయడం ద్వారా.. రాష్ట్రానికి మేలు చేయాలని ప్రజాస్వామ్య వాదులు సూచిస్తున్నారు.