ప్రత్యేకహోదా ఇలా మాత్రమే సాధ్యమా ?
రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి దక్కాల్సిన ప్రత్యేకహోద వివాదాస్పదమైపోయింది. అసలు రాష్ట్ర విభజనే అత్యంత వివాదాస్పదంగా జరిగింది.
రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి దక్కాల్సిన ప్రత్యేకహోద వివాదాస్పదమైపోయింది. అసలు రాష్ట్ర విభజనే అత్యంత వివాదాస్పదంగా జరిగింది. అడ్డుగోలుగా సమైక్య రాష్ట్రాన్ని విభజించిన అప్పటి యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రను అన్నీ విధాలుగా నష్టాలకు గురిచేసింది. దాని ఫలితాన్ని కాంగ్రెస్ అనుభవిస్తోంది. ఇపుడు విషయం ఏమిటంటే కొంతకాలంగా ఏపీకి ప్రత్యేకహోదా అంశం మళ్ళీ చర్చల్లో నలుగుతోంది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రత్యేకహోదా అంశాన్ని కాంగ్రెస్ నేతలు తెరమీదకు తెచ్చారు. పార్టీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిల అనవసరంగా ఈ అంశాన్ని కెలికారు.
ఇక్కడ విషయం ఏమిటంటే విభజన చట్టానికి తూట్లుపొడిచింది నరేంద్రమోడీ ప్రభుత్వం. ఏపీలో ప్రయోజనాలను తుంగలో తొక్కేసింది కేంద్రప్రభుత్వమే. ఇందులోనే ప్రత్యేకహోదా అంశం కూడా ఉంది. సజావుగా అమలవ్వాల్సిన ప్రత్యేకహోదా దురదృష్టవశాత్తు బాగా వివాదాస్పదమైపోయింది. నరేంద్రమోడి ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం ఏపీకి ప్రత్యేకహోదా అన్నది కలమాత్రమే. ఏపీ విషయంలో మోడీ ఎందుకింగ వివక్షతో వ్యవహరిస్తున్నారు ? ఎందుకంటే రాజకీయ నేపధ్యమనే చెప్పాలి. మొదటిది ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చినా రాజకీయంగా బీజేపీ బలపడేదేమీలేదు. ఎందుకంటే బీజేపీ బలం సున్నా.
ఇదే సమయంలో ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా ఏపీలో బీజేపీకి జరిగే నష్టమూ ఏమీలేదు. లాభమూ లేదు నష్టమూ లేదన్నపుడు ఇక ఏపీ గురించి ఆలోచించాల్సిన అవసరం మోడీకి ఏముంటుంది ? అందుకనే మోడీ ఉన్నంతవరకు ఏపీకి హోదా రాదన్నది వాస్తవం. హోదాను రాజకీయంగా మాత్రమే సాధించుకోవాలి తప్ప వేరే మార్గంలేదు. రాజకీయంగా అంటే కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి ఏపీ ఎంపీల మద్దతు తప్పనిసరిగా అవసరమవ్వాలి.
అధికారంలో ఏ పార్టీ ఉన్నది అన్నదాంతో సంబంధంలేకుండా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తేనే కేంద్రప్రభుత్వానికి మద్దతిస్తామని ఏపీ రాజకీయపార్టీలు కండీషన్ పెట్టి గట్టిగా పట్టు బిగిస్తేనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయాలని అనుకుంటున్న కూటమి దిగొచ్చి ప్రత్యేకహోదాను ప్రకటిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటుకాగానే ముందు ప్రత్యేకహోదా అమలును కండీషన్ గా పెట్టినపుడు మాత్రమే రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తుంది. లేకపోతే ఎంతకాలం మాట్లాడుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదని అందరికీ తెలిసిందే.