దువ్వాడ శ్రీను ఫ్యామిలీ వ్యవహారం... మాధురి చెప్పిన ఈ 'అడల్టరీ' ఏమిటీ?
తనదగ్గర ఏమి ఉందని మాధురి తనను ట్రాప్ చేస్తుందని శ్రీను ఎదురు ప్రశ్నిస్తున్నాడు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది. మాధురి అనే మహిళ దువ్వాడ శ్రీనివాస్ ను ట్రాప్ చేసిందని, తమకు దూరం చేసిందని అతని భార్య వాణి, కుమార్తెలు ఆరోపిస్తున్నారు. తనదగ్గర ఏమి ఉందని మాధురి తనను ట్రాప్ చేస్తుందని శ్రీను ఎదురు ప్రశ్నిస్తున్నాడు.
ఈ సందర్భంగా స్పందించిన సదరు మాధురి అనే మహిళ.. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఉంటున్నట్లు చెప్పారు, ఇద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో ఇద్దరికీ పెళ్లి అయ్యి విడాకులు తీసుకోకుండా కలిసి ఉండటం ఎలా..? సమజీవనం చేస్తున్నారా..? అనే ఓ ప్రశ్న మీడియా నుంచి ఆమెకు ఎదురైంది. దీంతో.. పెళ్లికాని వాళ్లు చేస్తే అది సహజీవనం.. పెళ్లి అయినవాళ్లు చేస్తే అది అడల్టరీ అని స్పందించారు!
దీంతో... ఏమిటీ అడల్టరీ అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఇది చట్ట సమ్మతమేనా.. ఇది నైతికమేనా అనే చర్చా మొదలైంది. ఈ సమయంలో... అసలు ఈ అడల్టరీ అంటే ఏమిటి.. గతంలో ఇలాంటి వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏమని స్పందించిందనేది ఆసక్తిగా మారింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అడల్టరీ శిక్షార్హమైన నేరం కాదు!
అవును... పెళ్లైన వ్యక్తి, వివాహం అయిన మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకోవడం శిక్షార్హమైన నేరం కాదని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ లోని అడల్టరీకి సంబంధించిన సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని తెలిపీంది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ నారీమన్, ఏఎం ఖాన్ విల్కర్, డీవై చంద్రచూడ్, ఇందు మల్హోత్రాలతో కూడిన బెంచి 2018 సెప్టెంబర్ లో ఈ మేరకు తీర్పు వెలువరించింది!
అలడ్టరీ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు!:
>> అడల్టరీ అనేది శిక్షార్హమైన నేరం కాదు. కానీ.. ఆ కారణంతో విడాకులు తీసుకోవచ్చు.
>> అయితే ఈ వివాహేతర సంబంధం కారణంగా భాగస్వామి ఆత్మహత్యకు పాల్పడితే, దానికి సాక్ష్యం చూపించగలిగితే.. ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణంగా కేసు నమోదు చేయొచ్చు.
>> అడల్టరీ వల్ల దాంపత్యం అసంతృప్తికి కారణం కావడం లేదు.. అసంతృప్తితో కూడిన దాంపత్యమే ఈ పరిస్థితికి దారి తీస్తుంది.
>> భార్యను భర్త తన ఆస్తిగా భావిస్తూ, మహిళల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించడానికి సెక్షన్ 497 కారణమవుతోంది.. ఇది కాలం చెల్లిన నిబంధన!
ఇదే సమయంలో... వివాహ వ్యవస్థకు ముగింపు పలికే తప్పుడు చర్యగా కూడా అడల్టరీని బెంచ్ అభివర్ణించింది.