వివాదాస్పద నియోజకవర్గం టికెట్ రేసులో మహిళా సర్పంచ్

తెలంగాణలో ప్రస్తుత టర్మ్ ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పదమైన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి

Update: 2023-09-01 05:52 GMT

తెలంగాణలో ప్రస్తుత టర్మ్ ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పదమైన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. ఎమ్మెల్యేల తీరుతో తరచూ ఆ నియోజకవర్గాలు వార్తల్లో నిలిచాయి. మరికొన్ని నియోజకవర్గాల పేర్లు.. భూ ఆక్రమణలు, దందాల నేపథ్యంలో మీడియాకెక్కాయి. అయితే, ఇంకొన్ని నియోజకవర్గాల్లో మాత్రం మహిళల పట్ల వేధింపుల ఆరోపణలతో సంచలనంగా మారాయి. అలాంటివాటిలో ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి, జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మరొకటి.

బెల్లంపల్లిలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్త తనకు ఎదురైన లైంగిక వేధింపులపై ఢిల్లీ వరకు వెళ్లి పోరాడారు. ఆమె ఆరోపణలు ఎంతవరకు నిజమనేది ఇంతవరకు తేలలేదు. అయితే, బెల్లంపల్లి టికెట్ మళ్లీ సిటింగ్ ఎమ్మెల్యేకే దక్కింది. అయితే స్టేషన్ ఘనపూర్ లో మాత్రం సిటింగ్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను పక్కనపెట్టారు. ఆయన స్థానంలో మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. వాస్తవానికి ఇక్కడనుంచి దశాబ్దాలుగా శ్రీహరి ప్రాతినిధ్యం వహించారు. వరుస వివాదాల నేపథ్యంలో రాజయ్యకు టికెట్ దక్కడంపై మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. దీనికితగ్గట్లే టికెట్ రాలేదు. కడియం వంటి బలమైన నాయకుడు ప్రత్యామ్నాయంగా ఉండడం కూడా దీనికి కారణం.

రాజయ్య వేధిస్తున్నారంటూ రచ్చకెక్కి..

కడియం శ్రీహరి.. సీఎం కేసీఆర్ కు సన్నిహిత వ్యక్తి. టీడీపీలో ఉన్నప్పటి నుంచి వీరి మధ్య సాన్నిహిత్యం ఉంది. అందుకనే తెలంగాణ వచ్చాక కయంకు కేసీఆర్ పెద్దపీట వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొలి టర్మ్ లో డిప్యూటీ సీఎంనూ చేశారు. ఇప్పుడు మరోసారి ఘనపూర్ టికెట్ కూడా ఇచ్చారు. అయితే, ఇక్కడి పరిస్థితులు అనూహ్యంగా మారుతున్నాయి. టికెట్ రేసులో తాను సైతం

అని జానకిపురం సర్పంచి నవ్య ప్రకటించారు. .ఏడు దశాబ్దాల చరిత్రలో ఘనపూర్ లో ఒక్కసారి కూడా మహిళకు అవకాశం రాలేదని చెబుతున్నారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను వేడుకోనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రముఖులను భర్తతో పాటు కలవనున్నారు. కాగా, ఆరు నెలల కిందట ఎమ్మెల్యే రాజయ్యపై నవ్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వివాదం చాలా రోజుల పాటు సాగింది. చివరకు సద్దుమణిగింది. అయితే, సర్పంచిగా ఉన్న ఆమె ఎమ్మెల్యే టికెట్ కోసం అర్జీ పెట్టుకోవడం వెనుక ఎవరి ప్రోద్బలమైనా ఉందా? సొంత ఆలోచనతోనే ఇలా చేశారా? అనేది తెలియాల్సి ఉంది.

అసలు అవకాశం ఉందా..?

సీఎం కేసీఆర్ ఇప్పటికే 115 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించారు. మరో నాలుగింటికే వెల్లడించాల్సి ఉంది. అందులోనూ ఘనపూర్ లో శ్రీహరికి టికెట్ ఖరారు చేశారు. అటుఇటుగా కొన్ని మార్పులు ఉంటాయని ఆయన చెప్పినప్పటికీ.. శ్రీహరిని మాత్రం తప్పించే అవకాశం లేదు. కానీ, సర్పంచి నవ్య చివరి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె అడుగులతో ఘనపూర్‌లో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

Tags:    

Similar News