"నీట్"లో క్వాలిఫై కాలేదని విద్యార్థి ఆత్మహత్య... తండ్రి కూడా!

కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది.

Update: 2023-08-14 12:44 GMT

చావు దేనికీ పరిష్కారం కాదని నిత్యం చెబుతూనే ఉంటారు.. క్షణికావేశంలోనో, బాధలోనో, ఆవేదనలోనో... మరో పరిష్కారం దిశగా ఆలోచించకుండా, మృత్యువుని ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా "నీట్" లో సీటు రాలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా... కొడుకు లేడని తండ్రి మరణించిన విషాద సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

అవును... రెండు సార్లు ప్రయత్నించినా నీట్‌ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)లో ర్యాంకు రాలేదన్న మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది.

2022లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థి.. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే "నీట్‌"కు శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో రెండు సార్లు పరీక్ష రాసినా "నీట్‌" లో క్వాలిఫై కాలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఈనెల 12న చెన్నైలోని క్రోమెపేట్‌ లో ఉరేసుకున్నాడు. వెంటనే గమనించి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ సమయంలో తన మృతికి గల కారణాలు తెలిపే ఎలాంటి సూసైడ్‌ నోట్ లభించలేదని పోలీసులు చెబుతుండగా.. నీట్‌ క్వాలిఫై కాలేదన్న మనస్తాపంతోనే అతడు చనిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అనంతరం తన కొడుకు మృతికి నీట్ పరీక్షే కారణం అంటూ ఆ విద్యార్థి తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపింది. ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. విద్యార్థులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని.. ఆత్మ విశ్వాసంతో జీవితంలో ముందుకు వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా... నీట్ వల్ల జరిగిన చివరి మరణాలు ఇవే కావాలని.. నీట్ అడ్డంకులు త్వరలో తొలగిపోతాయని అన్నారు.

కాగా... "నీట్‌" నుంచి తమిళనాడును మినహాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈబిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి తిరస్కరించారు! అయితే... ఈ బిల్లు అంశంలో గవర్నర్‌ అవసరం ఏమీలేదని, బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరిందని చెబుతున్నారు.

Tags:    

Similar News