శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థిపై హత్యాయత్నం.. ఎవరి పని?
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల వేళ.. హత్యా రాజకీయాలు మరోసారి తెరమీదికి వచ్చాయి.
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల వేళ.. హత్యా రాజకీయాలు మరోసారి తెరమీదికి వచ్చాయి. ఏకంగా శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్‌కుమార్‌రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించారని.. టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నీతో సెల్ఫీ తీసుకోవాలని ఉందంటూ... చేరువకు వచ్చిన ఆ వ్యక్తి దగ్గర పదునైన కత్తిని టీడీపీ నేతలు గుర్తించారు. దీంతో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
తమ నాయకుడిని హత్య చేసేందుకే నిందితుడు కత్తితో వచ్చాడని టీడీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అసలు ఏం జరిగిందంటే.. సుధీర్‌రెడ్డి ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని స్థానిక అయిదో వార్డు బహుదూరుపేట వద్ద ప్రచారంలో ఉండగా మహేష్‌కుమార్ అనే వ్యక్తి సుధీర్‌రెడ్డితో సెల్ఫీ తీసుకుంటానని పార్టీ శ్రేణులను కోరాడు.
అయితే, మద్యం తాగి ఉండటంతో కాస్తంత నిశితంగా పరిశీలించగా అతడి చేతిలో కత్తి ఉండటాన్ని గుర్తించారు. ఒక్కసారిగా అప్రమత్తమై నిందితుడిని పోలీసులకు అప్పగించారు. మహేష్‌కుమార్ ను వైసీపీ సానుభూతి పరుడిగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు రెండో పట్టణ సీఐ రారాజు తెలిపారు. నిందితుడు మాట్లాడుతూ శ్రీకాళహస్తి బహుదూరుపేటలో జరిగిన జాతర నిమిత్తం వచ్చానని, స్వీయభద్రత నిమిత్తం కత్తిని ఉంచుకున్నట్లు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.
ఇక, సుధీర్‌రెడ్డిని ఎందుకు టార్గెట్ చేసుకున్నారనే విషయాన్ని పరిశీలిస్తే.. ఇటీవల ఆయన వలంటీర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చిన సుధీర్.. వారిని తాము అధికారంలోకి రాగానే ఉగ్రవాదులను ఏరినట్టు ఏరిపారేస్తామని చెప్పారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ వ్యాఖ్యలను టీడీపీ కూడా ఖండించింది. సదరు వ్యాఖ్యలు బొజ్జల వ్యక్తిగతమని పార్టీబహిరంగ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై హత్యాయత్నానికి ప్రయత్నించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.