అక్కడ ‘చౌదరి’ ఎంట్రీతో మారుతున్న లెక్కలు!
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పది అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పది అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు పార్లమెంటు స్థానాలకు బీజేపీ అ«ధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది.
అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కాగా విజయవాడ పశ్చిమ నుంచి బీజేపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. దీంతో విజయవాడ పశ్చిమ స్థానంతోపాటు పార్లమెంటు స్థానంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో పొలిటికల్ లెక్కలు మారతాయని అంటున్నారు.
సుజనా చౌదరి స్వగ్రామం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కంచికచర్ల. టీడీపీ తరఫున రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ఉన్న బలమైన కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో సుజనా చౌదరికి విస్తృత పరిచయాలు ఉన్నాయి.
ఇప్పుడు సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగితే ఆయన ఆ పరిచయాలను పూర్తి స్థాయిలో వాడుకోవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా ఆర్థిక, అంగ బలాలు ఆయనకు పుష్కలంగా ఉండటం కూటమిలోని అభ్యర్థులకు సైతం మేలు చేస్తుందని అంటున్నారు.
విజయవాడ పశ్చిమలో తనకున్న ఆర్థిక, అంగ బలాలతోపాటు కూటమి బలంతో పోటీ చేస్తే సుజనా గెలుపు ఖాయమంటున్నారు. మరోవైపు వైసీపీ ప్రస్తుతం విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్ కు మార్చింది. విజయవాడ పశ్చిమ సీటును షేక్ ఆసిఫ్ అని ఒక ముస్లిం అభ్యర్థికి కట్టబెట్టింది.
వాస్తవానికి విజయవాడ పశ్చిమలో జనసేన పార్టీ పోటీ చేయాల్సి ఉంది. బీజేపీ కూటమిలో చేరకముందు విజయవాడ పశ్చిమ సీటును జనసేనకే కేటాయించారు. అయితే చివరి నిమిషంలో కూటమిలో బీజేపీ కూడా చేరడంతో జనసేన తాను పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లో మూడింటిని తగ్గించుకుని 21కే పరిమితమైంది. ఈ మూడు సీట్లలో విజయవాడ పశ్చిమ కూడా ఉంది.
ఈ నేపథ్యంలో విజయవాడ పశ్చిమలో సీటు ఆశించిన జనసేన నేత పోతిన వెంకట మహేశ్ కు సీటు లేకుండా పోయింది. దీంతో ఆయన తనకే సీటు ఇవ్వాలని, జనసేన ఆరంభం నుంచి తన డబ్బు ఖర్చు పెట్టుకుని పార్టీని నడిపానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరసన దీక్షల ద్వారా పార్టీపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే జనసేన ఇక్కడి నుంచి పోటీ చేసేలా కనిపించడం లేదు. సుజనా చౌదరే బీజేపీ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆయన రాకతో విజయవాడ పశ్చిమ స్థానంతోపాటు విజయవాడ పార్లమెంటు స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పొలిటికల్ లెక్కలు మారతాయని టాక్ నడుస్తోంది.