వైసీపీని వెంటాడుతున్న సునీత... మరో కీలక నిర్ణయం!

ఈ సమయంలో వైఎస్ జగన్ మరో సోదరి, మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత ఎంట్రీ ఇచ్చారు.

Update: 2024-11-14 05:26 GMT

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినవారిని ఏపీ సర్కార్ వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ‘నో క్షమాపణలు’ అన్నట్లుగా సాగుతున్నారు ఏపీ పోలీసులు! ఈ సమయంలో వైఎస్ జగన్ మరో సోదరి, మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత ఎంట్రీ ఇచ్చారు. ఆమె మరోసారి అవినాష్ రెడ్డి లక్ష్యంగా ముందుకు కదులుతున్నారని తెలుస్తోంది.

అవును... సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినవారిలో వర్రా రవీందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకూ ఇతడిపై రాష్ట్రవ్యాప్తంగా సుమారు 34 కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. ఈ లెక్కే చెబుతోంది.. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో తడు సాగించిన అరాచకం అని అంటున్నారు.

ఈ సమయంలో తాజాగా సునీత ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా... వర్రా రవీందర్ రెడ్డిపై ఆమె పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు! తనను అత్యంత దారుణ పదాలతో దూషించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన మరో సానుభూతిపరుడు ఉదయ్ పైనా ఆమె ఫిర్యాదు చేసారు.

మరోపక్క.. వర్రా రవీందర్ రెడ్డికి పోస్టులు పెట్టమని ఆర్డర్ వేసింది అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి అని చెబుతున్న వేళ... రాఘవరెడ్డి అరెస్టు తర్వాత విచారణలో భాగంగా కీలక విషయాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో... ఈ వ్యవహారం ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకోవడం కంఫర్మ్ అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

ఈ విధంగా.. ప్రస్తుతం పరారీలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పట్టుకొని విచారిస్తే ఆయన ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో మరింత కీలకంగా మారనుందని అంటున్నారు. అయితే ఇప్పటికే... వర్రా రవీందర్ రెడ్డి చెప్పిన అంశాలతో నేరుగా ఎంపీ అవినాష్ పై ఫిర్యాదు చేసేందుకు సునీత సిద్ధమయ్యారని చెబుతున్నారు.

కాగా... సోషల్ మీడియా పోస్టులపై వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. షర్మిల, విజయమ్మ, సునీత లపై పెట్టిన పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి తనకు కంటెంట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. రాఘవరెడ్డికి అవినాష్ రెడ్డి బ్రీఫింగ్ ఇస్తుంటే ఆయన డైరీలో నోట్ చేసుకునేవారని తెలిపారు!

దీంతో... సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి సూచనలు కీలక పాత్ర పోషించాయని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారని అంటున్నారు. దీంతో... రాఘవరెడ్డి అరెస్ట్ అనంతరం అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమయంలో న్యాయనిపుణులతో సునీత కూడా చర్చిస్తున్నారని కథనాలొస్తున్నాయి!

Tags:    

Similar News