రజినీ చేసింది అంత తప్పా?

సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ దగ్గర తన స్టామినాను చూపిస్తున్నారు.

Update: 2023-08-20 11:48 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ దగ్గర తన స్టామినాను చూపిస్తున్నారు. ఆయన కొత్త చిత్రం ‘జైలర్’ ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయిందో తెలిసిందే. పది రోజుల్లోనే వరల్డ్ వైడ్ ఏకంగా రూ.500 కోట్ల వసూళ్లను సాధించిందీ చిత్రం. రెండో వీకెండ్లోనూ ఈ సినిమా హవా నడుస్తోంది. తనను తక్కువ చేసి మాట్లాడిన వాళ్లకు.. తన హేటర్స్ అందరికీ ఈ సినిమాతో దీటైన సమాధానం చెప్పాడు సూపర్ స్టార్. ఇలా అంతా సానుకూలంగా సాగిపోతున్న సమయంలో రజినీ చేసిన ఓ పని విమర్శలకు దారి తీసింది. ఆయన లక్నోకు వెళ్లి ఉత్తరప్రదేశ్ రాజధాని యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ఐతే యోగిని చూడగానే రజినీ పాదాభివందనం చేయడం చర్చనీయాంశంగా మారింది. 72 ఏళ్ల వయసున్న రజినీ.. తనకంటే 20 ఏళ్లు చిన్న వయస్కుడైన యోగికి పాదాభివందనం చేయడం చాలామందికి రుచించలేదు.

ఈ విషయాన్ని చాలామంది రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. ముందు నుంచి బీజేజీ సానుభూతిపరుడిగా, మద్దతుదారుగా ఉంటున్న రజినీ.. ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రికి పాదాభివందనం చేయడాన్ని తప్పుబడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే యూపీ సీఎంను కలిసి రాజకీయ చర్చలు జరిపారని.. తర్వాత తమిళనాడుకు వచ్చి బీజేపీకి మద్దతుగా వ్యాఖ్యానాలు చేస్తారని.. ప్రచారం కూడా చేసినా ఆశ్చర్యం లేదని తమిళనాడు జనాలు మాట్లాడుకుంటున్నారు. ఐతే రజినీ మద్దతుదారులు మాత్రం ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని అంటున్నారు. రజినీలోని ఆధ్యాత్మిక కోణాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఆధ్యాత్మిక గురువులను, పీఠాధిపతులను రజినీ వయసు కోణంలో చూడకుండా తనకంటే చిన్న వారైనప్పటికీ పాదాభివందనం చేస్తారని.. యోగి ముఖ్యమంత్రే అయినప్పటికీ ఒక మఠానికి అధిపతి అని.. ఆయన్ని ఒక సన్యాసిగా భావించే రజినీ పాదాభివందనం చేశారని.. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయం అని.. రాజకీయాలతో సంబంధం లేదని.. దీన్ని తప్పుబట్టడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News