వర్గీకరణ రాష్ట్రాలదే.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీం అత్యంత సంచలన తీర్పు!
6:1తో సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఈ సంచలన తీర్పును వెలువరించింది.
షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఎస్సీ), షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ)లకు కల్పించిన రిజర్వేషన్లలో ఉప వర్గీకరణపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం అత్యంత కీలక తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ రెండు వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని తేల్చిచెప్పింది. 2004లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కనబెట్టింది. 6:1తో సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఈ సంచలన తీర్పును వెలువరించింది.
ఉమ్మడి ఏపీలో వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టారు. ఎస్సీలనూ బీసీల తరహాలో ఏబీసీడీలుగా వర్గీకరించాలనే డిమాండ్ అప్పట్లో ఉద్యమమే సాగింది. దీంతో ఉమ్మడి ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టింది. అయితే, 2004లో ఉమ్మడి ఏపీలో సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండగా 2004లో ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీనిపై అప్పటినుంచి వాదవివాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ఎస్సీ వర్గీకరణకు మోదీ హామీ ఎస్సీ వర్గీకరణకు మంద క్రిష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఏర్పాటైంది. మూడు దశాబ్దాలుగా తమ డిమాండ్ సాధనకు ఉద్యమిస్తోంది. ఉమ్మడి ఏపీ నుంచి ప్రస్తుతం విభజిత ఏపీ, తెలంగాణ వరకు సీఎంలందరితోనూ మంద క్రిష్ణ ఈ డిమాండ్ ను లేవనెత్తారు. చివరగా లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ సైతం ఎస్సీ వర్గీకరణకు హామీనిచ్చారు. అంతేకాక కమిటీనీ వేశారు.
అయితే, ఎస్సీ వర్గీకరణపై చాలా వివాదాలు ఉన్నాయి. ఎస్సీల్లో మాల, మాదిగలతో పాటు అనేక ఉప కులాలు ఉన్నాయి. వీటిలో రిజర్వేషన్ ఫలాలు కొందరికే ఎక్కువగా అందుతున్నాయనేది ఫిర్యాదు. దీనిని నివారించేందుకు ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేయాలనేది ఎమ్మార్పీఎస్ డిమాండ్. అయితే, మాలలు దీనిపై తీవ్ర అభ్యంతరం లేవనెత్తుతున్నారు. ఇప్పుడు దాదాపు మూడు దశాబ్దాల డిమాండ్ కు ముగింపు పలుకుతూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
ఉమ్మడి ఏపీలో గాంధీభవన్ ఘటన ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ను నెరవేర్చాలంటూ ఎమ్మార్పీఎస్ యువకులు 2008లో హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ వద్ద పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. కొందరు ఆత్మహత్యా యత్నం చేశారు. ఒకరు తీవ్ర కాలిన గాయాలతో చనిపోయారు.
వ్యతిరేకించింది ఒక్కరే..ఏడుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది మాత్రమే ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణను వ్యతిరేకించారు. మిగతా ఆరుగురూ సమర్థించడంతో 6:1 మెజారిటీతో తీర్పు వెలువరించారు.