ముఖ్యమంత్రి ఇంట్లో ఇలాంటి గూండాలే ఉన్నారా?

ఒక సీఎం ఇంట్లో గూండాలాగా నిందితుడు బిభవ్‌ కుమార్‌ ప్రవర్తన ఉందని సుప్రీంకోర్టు కడిగిపారేసింది. సీఎం కేజ్రీవాల్‌ నివాసం ఏమైనా ఆయన సొంత ప్రైవేటు బంగళానా అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2024-08-01 14:30 GMT

ఈ ఏడాది మే 13న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో ఆ పార్టీ రాజ్యసభ మహిళా ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్‌ మాజీ చైర్‌ పర్సన్‌ అయిన స్వాతి మాలీవాల్‌ పై తీవ్రమైన దాడి జరిగిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌ ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లిన స్వాతి మాలీవాల్‌ ను ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ అడ్డుకుని చితకబాదాడు. ఆమె నెలసరితో ఉన్నానని వేడుకున్నప్పటికీ అతడు కనికరించలేదు. దీంతో కడుపులో, ముఖంపైన స్వాతికి తీవ్రగాయాలయ్యాయి.

స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అప్పట్లో రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ ఆడుతున్న కుట్రలో స్వాతి పావుగా మారిందని అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. కాగా నిందితుడు బిభవ్‌ కుమార్‌ బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురు అయ్యింది. దీంతో అతడు సుప్రీంకోర్టు తలుపుతట్టాడు.

ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రి ఇంట్లో ఇలాంటి గూండాలే ఉంటున్నారా అని నిలదీసింది. బాధితురాలు తాను నెలసరితో ఉన్నానని.. కొట్టొద్దని వేడుకున్నప్పటికీ దాడి చేయడమేంటని కోర్టు మండిపడింది.

కాంట్రాక్టు కిల్లర్లు, హంతకులు, దోపిడీదారులుగా ఆరోపణలు ఎదుర్కొనేవారికి కూడా బెయిలు ఇస్తుంటామని.. కానీ ఈ కేసు తీవ్రత చూసి షాక్‌ తిన్నామని సుప్రీంకోర్టు హాట్‌ కామెంట్స్‌ చేసింది. ఒక మహిళతో ప్రవర్తించే తీరు ఇదేనా అని నిందితుడు బిభవ్‌ కుమార్‌ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె తన శారీరక పరిస్థితి బాగోలేదని చెబుతున్నా దాడి చేశారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారని కోర్టు పేర్కొంది.

సీఎం కేజ్రీవాల్‌ ఇంట్లోకి వచ్చేందుకు మహిళా ఎంపీకి హక్కు లేదా అని సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. ఆమెకు హక్కు లేకపోతే అతడికి కూడా ఉండే హక్కు లేదు కదా అని నిలదీసింది. నిందితుడు బిభవ్‌ కుమార్‌ అసలు ఏమనుకుంటున్నాడని నిప్పులు చెరిగింది. తాను చేసిన పనికి కనీసం పశ్చాత్తాపమైనా వ్యక్తం చేస్తున్నాడా అని ప్రశ్నించింది.

ఒక సీఎం ఇంట్లో గూండాలాగా నిందితుడు బిభవ్‌ కుమార్‌ ప్రవర్తన ఉందని సుప్రీంకోర్టు కడిగిపారేసింది. సీఎం కేజ్రీవాల్‌ నివాసం ఏమైనా ఆయన సొంత ప్రైవేటు బంగళానా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడు బిభవ్‌ కుమార్‌ కు బెయిల్‌ నిరాకరించింది. అతడి పిటిషన్‌ పై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 7కి వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చింది.

Tags:    

Similar News