సెలవు రోజున సుప్రీం ధర్మాసనం ఎందుకు పని చేసింది?
పశ్చిమబెంగాల్ లో ఎంబీబీఎస్ ఎంట్రన్స్ కోసం జారీ చేసిన కులధ్రువీకరణ పత్రాల్లో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి
ఒక రాష్ట్ర హైకోర్టులోని రెండు ధర్మాసనాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు వీలుగా.. సుప్రీంకోర్టు ధర్మాసనం సెలవు రోజున పని చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ ఆ కేసేమిటి? ఆ వివాదం ఏమిటి? ఇంతకూ సుప్రీంకోర్టు సదరు కేసును పూర్తిగా తీసుకొని ఏం చేసింది? దానికి ఎవరు నేత్రత్వం వహించారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఆసక్తికర సమాధానాలు వస్తాయి. అదేమంటే..
పశ్చిమబెంగాల్ లో ఎంబీబీఎస్ ఎంట్రన్స్ కోసం జారీ చేసిన కులధ్రువీకరణ పత్రాల్లో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఒక పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణకు జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ఏక సభ్య ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర పోలీసులపై తనకు నమ్మకం లేదన్న జడ్జి.. అవకతవకల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు.
ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెంటనే ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది. జస్టిస్ సోమేన్ సేన్.. జస్టిస్ ఉదయ్ కుమార్ గంగూలీలతో కూడిన డివిజన్ బెంచ్ దీనిపై విచారణ జరిపింది. ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేసింది. దీని తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై అనూహ్యంగా సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ విచారణ చేపట్టారు. ద్విసభ్య ధర్మాసనం కొట్టేసిన ఉత్తర్వును కొట్టేస్తున్నట్లుగా ప్రకటించారు. దర్యాప్తు చేపట్టాలని సీబీఐను ఆదేశించారు. తన తీర్పు కాపీ వెలువకుండానే.. అప్పీలు మెమో లేకుండానే ద్విసభ్య ధర్మాసనం స్టే ఎలా విధించిందో చెప్పాలంటూ అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించారు. డివిజన్ బెంచ్ లోని జస్టిస్ సొమేన్ సేన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
''జస్టిస్ సౌమేన్ సేన్ ను ఒడిశశా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం 2021 సెప్టెంబరు 16న సిఫార్సు చేసింది. దాన్ని ధిక్కరిస్తూ రెండేళ్లుగా ఆయన కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా ఎలా కొనసాగుతున్నారు? ఆయన వెనుక ఎవరు ఉన్నారు?'' అంటూ వేసిన ప్రశ్నలు పెను సంచలనంగా మారాయి. కలకత్తా హైకోర్టులోనెలకొన్న ఇబ్బందికర పరిస్థితిని సుప్రీంకోర్టు సుమోటోగా పరిగణలోకి తీసుకుంది.
దీనిపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేత్రత్వంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా... జస్టిస్ బీఆర్ గవాయ్.. జస్టిస్ సూర్యకాంత్.. జస్టిస్ అనిరుద్ద బోస్ లతో కూడి ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. శనివారం సెలవు అయినప్పటికీ ఈ బెంచ్ విచారణ జరిపింది. ఈ కేసు తదుపరి విచారణ చర్యలు.. సీబీఐ దర్యాప్తునకు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల్ని నిలిపస్తున్నట్లుగా ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి.. హైకోర్టు పిటిషన్ దారులకు నోటీసులు జారీ చేస్తున్నట్లుగా వెల్లడించింది. తదుపరి విచారణను సోమవారం నుంచి చేపడతామని ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాల్ని తమ పరిధిలోకి తీసుకున్నట్లుగా ప్రత్యేక ధర్మాసనం వెల్లడించింది. ఈ వ్యవహారం న్యాయవాద వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.