గవర్నర్ లపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు... ఆ అధికారం వారికి లేదు!
ఈ సమయంలో వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లడం, సుప్రీం కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో నంబరు 10వ తేదీన సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కాపీ వెబ్ సైట్ లో ఉంచారు.
గతకొంతకాలంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ వ్యవహారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై అటు పంజాబ్, ఇటు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కాస్త ప్రభావం ఎక్కువగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లడం, సుప్రీం కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో నంబరు 10వ తేదీన సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కాపీ వెబ్ సైట్ లో ఉంచారు.
అవును... పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై నంబరు 10వ తేదీన సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కాపీని వెబ్ సైట్ లో ఉంచారు. ఇందులో భాగంగా... రాష్ట్ర అసెంబ్లీలు రూపొందించిన చట్టాలను అడ్డుకునేందుకు గవర్నర్ లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో ఇటువంటి చర్యలు ప్రజలు ఎన్నుకొన్న అసెంబ్లీ అధికారాన్ని తగ్గించే విధంగా ఉన్నాయని పేర్కొంది.
ఇదే సమయంలో ఈ ఏడాది జూన్ 19, 20 తేదీల్లో పంజాబ్ శాసనసభ ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని పంజాబ్ గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా... శాసనసభ ఆమోదించిన బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వాటిని పెండింగ్ లో ఉంచే స్వేచ్ఛ గవర్నర్ కు ఉండదని స్పష్టం చేసింది.
ఇదే క్రమంలో సుప్రీం కోర్టు గవర్నర్ ల అధికారాలపై మరిన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... ఎన్నికల ప్రక్రియ ద్వారా గవర్నర్ ఎన్నిక కానప్పటికీ.. రాజ్యాంగబద్ధంగా ఆయనకు కొన్ని అధికారాలు ఉంటాయని.. అయితే అసెంబ్లీ చట్టాలు రూపొందించకుండా అడ్డుకునేందుకు ఉపయోగించే అధికారం మాత్రం గవర్నర్ కు లేదని తెలిపింది. ఇదే సమయంలో... రాష్ట్రపతి నియమించిన గవర్నర్ రాష్ట్రానికి నామమాత్రపు అధిపతిగా మాత్రమే వ్యవహరిస్తారని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో... అటు రాష్ట్రంలో అయినా, ఇటు దేశానికి సంబంధించినవి అయినా... పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుందని సుప్రీం తెలిపింది. ఈ నిర్ణయాలకు ఆ రాష్ట్ర గవర్నర్ మార్గదర్శిలా మాత్రమే వ్యవహరించాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది.
కాగా... రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానించిన బిల్లులను ఉద్దేశపూర్వకంగానే గవర్నర్ లు ఆమోదించడంలేదని పంజాబ్ సహా తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం నవంబరు 10న పంజాబ్ గవర్నర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన తీర్పులో కీలక విషయాలు వెల్లడించింది!