రియల్ హీరో సూర్య.. స్టాలిన్ సర్కారుపై పరోక్ష విమర్శలు
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీసారా తాగిన కారణంగా ఇప్పటివరకు 50కు పైగా మరణాలు చోటు చేసుకోవటం.. దీనికి కారణమైన ఊరు ఇప్పుడు వల్లకాడుగా మారిన వైనంపై సూర్య స్పందించారు.
సామాజిక అంశాల మీద రియాక్టు అయ్యే విషయంలో టాలీవుడ్ ఎప్పుడూ వెనుకపడి ఉంటుంది. అందునా పాలనా పగ్గాలు ఉన్న వారిపై విమర్శలు చేయటానికి.. ప్రభుత్వ వైఫల్యాల్ని వేలెత్తి చూపించే సాహసం చేయరు టాలీవుడ్ హీరోలు.. హీరోయిన్లు. ఈ తీరుకు కాస్త భిన్నంగా వ్యవహరిస్తుంటారు కోలీవుడ్ నటీనటులు. మరి.. ముఖ్యంగా విపత్తులు విరుచుకుపడినప్పుడు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి సాదాసీదా ప్రజల్ని రక్షించేందుకు.. వారికి అండగా నిలించేందుకు బయటకు వస్తుంటారు కోలీవుడ్ హీరోలు.
వీరికి భిన్నంగా టాలీవుడ్ హీరోలు.. నటీనటులు విరాళాలు సేకరించటానికి.. ఫోటోలకు ఫోజులు ఇవ్వటానికి వస్తారే కానీ.. సమస్య ఉన్న దగ్గరకు వెళ్లి.. కష్టంలో ఉన్న వారికి సాయం చేసే సాహసం చేయరు. ఏదైనా అనూహ్య విషాదం విరుచుకుపడినప్పుడు ప్రభుత్వం తప్పుల్ని ప్రశ్నించే ధైర్యం చేయరు. టాలీవుడ్ హీరోలతో పోలిస్తే కోలీవుడ్ హీరోల్లో కొందరు మాత్రం తమ కడుపులోని వేదనను దాచుకోవటానికి ఇష్టపడరు. తాజాగా అలాంటి తీరునేప్రదర్శించారు అగ్ర హీరో సూర్య.
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీసారా తాగిన కారణంగా ఇప్పటివరకు 50కు పైగా మరణాలు చోటు చేసుకోవటం.. దీనికి కారణమైన ఊరు ఇప్పుడు వల్లకాడుగా మారిన వైనంపై సూర్య స్పందించారు. చిన్న ఊరిలో యాభై మరణాలు చోటు చేసుకోవటాన్ని ఆయన తప్పు పట్టారు. వరదలు.. తుపాను లాంటి కాలాల్లోనూ కూడా ఇంత విషాదం చోటు చేసుకోదని చెప్పటం ద్వారా.. యాభై మరణాల తీవ్రతను కళ్లకు కట్టినట్లు చెప్పే ప్రయత్నం చేశారు. అంతకంతకూ పెరుగుతున్న మరణాలు.. బాధితుల ఆక్రందనలు మనసును వణికిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గత ఏడాది చోటు చేసుకున్న విషాదాన్ని ప్రస్తావించారు. ‘గత ఏడాది విళుపురం జిల్లాలో మిథనాల్ కలిపిన కల్తీసారా తాగి 22 మంది మరణించారు. దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజబుత్వం హామీ ఇచ్చింది. కానీ.. ఎలాంటి మార్పు జరగలేదు. ప్రభుత్వాలు మద్యం దుకాణాల ద్వారా ప్రజల్ని మద్యం తాగిస్తున్నారు. అక్కడ రూ.150 ఖర్చు చేసి తాగేవాళ్లు డబ్బులు లేనప్పుడు రూ.50కు దొరికే కల్తీసారా తాగుతున్నారు. ఇది వ్యక్తి సమస్య కాదు. ఓ కుటుంబ సమస్య. సమాజ సమస్య’’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కీలక అంశాన్ని ప్రస్తావించారు హీరో సూర్య. మద్యనిషేధ విధానంలో ముఖ్యమంత్రి ప్రజా ప్రయోజన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్న సూర్య.. కల్తీసారాకు అడ్డుకట్ట వేయలేని ప్రభుత్వానికి తన ఖండనను తెలియజేందుకు వెనుకాడలేదు. ఈ మాత్రం ధైర్యం చేసే దమ్ము టాలీవుడ్ లో ఏ హీరోకు ఉంది చెప్పండి?