మోడీ హ్యాట్రిక్ కొట్టటం ఖాయమట.. తాజా సర్వే తేల్చింది ఇదే

ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటిగా పేరున్న టైమ్స్ నౌ చానల్ తాజాగా జాతీయ స్థాయిలో ఎన్నికల సర్వేను చేపట్టింది.

Update: 2023-08-17 04:38 GMT

ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటిగా పేరున్న టైమ్స్ నౌ చానల్ తాజాగా జాతీయ స్థాయిలో ఎన్నికల సర్వేను చేపట్టింది. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. మరో ఏడెనిమిది నెలల్లో లోక్ సభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. జాతీయ స్థాయిలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు సొంతం చేసుకునే అవకాశం ఉందన్న విషయంపై భారీ సర్వే నిర్వహించింది. ఇప్పటికే రెండు దఫాలు తిరుగులేని అధిక్యతతో దూసుకెళుతున్న మోడీ సర్కారు.. మరోసారి అధికారంలోకి రావటం ఖాయమన్న విషయాన్ని తాజా సర్వే స్పష్టం చేసింది.

మోడీ నేత్రత్వంలోని ఏన్ డీఏ సర్కారుకు పోటీగా.. ఇండియా కూటమి ఆవిర్భవించిన నేపథ్యంలో వచ్చే ఎన్నికలు మరింత పోటాపోటీగా సాగటం ఖాయమన్న విశ్లేషణలు వచ్చాయి. అయితే.. సదరు చానల్ చేసిన సర్వే మాత్రం అందుకు భిన్నమైన అంశాల్ని తెర మీదకు తీసుకురావటం గమనార్హం. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే.. జాతీయ స్థాయిలో బీజేపీ 300 సీట్లను సొంతం చేసుకుంటుందని సదరు సర్వే వెల్లడించింది.

కనిష్ఠంగా 296 సీట్లు.. గరిష్ఠంగా 326సీట్లను బీజేపీ సాధిస్తుందన్న విషయాన్ని తేల్చిన టైమ్స్ నౌ చానల్.. మరోవైపు ఇండియా కూటమికి 160-190 సీట్లు సాధిస్తుందని వెల్లడించింది. హిందీ బెల్ట్ లో మోడీ మేజిక్ ఎన్ డీఏను మరోసారి పవర్ లోకి తీసుకురానున్న విషయాన్ని పేర్కొంది. ఈ ప్రాంతంలో ఎన్డీయే విజయవకాశాలు 80 శాతం ఉండటం గమనార్హం. ఉత్తరాదిన ముఖ్యంగా రాజస్థాన్.. గుజరాత్.. మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 80 స్థానాలకు 70 స్థానాల్ని ఏన్ డీఏ తన ఖాతాలోకి వేసుకుంటుందని పేర్కొంది.

అదే సమయంలో దక్షిణాదిన కర్ణాటక.. తమిళనాడు.. కేరళలో మాత్రం విపక్షాలు విజయాన్ని సాధిస్తాయని చెప్పిన ఈ సర్వే.. తటస్థంగా ఉన్న ఏపీలోని అధికార వైసీపీ.. తెలంగాణలోని బీఆర్ఎస్ లు ఘన విజయాన్ని సాధిస్తాయని వెల్లడించింది. తమిళనాడులో ఇండియా కూటమికి 30-34 సీట్లు.. కర్ణాటకలో ఎన్డీయే కూటమికి 18-20 సీట్లు.. బీహార్ లో ఎన్డీఏ కూటమికి 22-24 సీట్లు.. ఇండియా కూటమికి 16-18 సీట్లు రావొచ్చని చెప్పింది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు అధికార బీఆర్ఎస్ 9-11 స్థానాలు.. బీజేపీ 2-3 స్థానాలు.. కాంగ్రెస్ 3-4 స్థానాలు.. మజ్లిస్ ఒక స్థానాన్ని సొంతం చేసుకోనుంది. మొత్తంగా సర్వే వివరాల్ని చూసినప్పుడు.. మోడీ మేజిక్ కంటిన్యూ కానున్నట్లు.. హ్యాట్రిక్ పీఎంగా ఆయన సంచలన విజయాన్ని సొంతం చేసుకోవచ్చన్న విషయాన్ని తాజా సర్వే స్పష్టం చేసిందని చెప్పాలి.

Tags:    

Similar News