దేశాన్ని దోచి.. బంకర్ లో దాచి.. సిరియా అసద్ రహస్యం బట్టబయలు!
సిరియా వాస్తవానికి పశ్చిమాసియాలో అందమైన దేశం. 1971లోనే బషర్ తండ్రి అసద్ హఫీజ్ అల్ అసద్ అధికారం చేపట్టారు.
‘అధికారాంతమున చూడవలె..’ అనేది సామెత.. దీని అర్థం ఎవరైనా పదవి కోల్పోయినప్పుడు ఉండే పరిస్థితి అని.. మొన్న శ్రీలంకలో గొటబాయను సాగనంపినప్పుడు.. నిన్న బంగ్లాదేశ్ లో షేక్ హసీనాను దించేసినప్పుడు ఆ దేశంలో ఆందోళనకారులు అధికారిక నివాసాల్లోకి చొరబడి ఏం చేశారో అందరూ చూశారు. తాజాగా సిరియాలోనూ ఆందోళనకారులు దిగిపోయిన అధ్యక్ష్డుడు బషర్ అల్ అసద్ నివాసంలోకి చొరబడ్డాక.. అక్కడ అతిపెద్ద సీక్రెట్ ఫ్యామిలీ బంకర్ ను గమనించారు. ఈ మేరకు పలు వీడియోలు బయటకు వచ్చాయి.
55 ఏళ్ల సామ్రాజ్యం..
సిరియా వాస్తవానికి పశ్చిమాసియాలో అందమైన దేశం. 1971లోనే బషర్ తండ్రి అసద్ హఫీజ్ అల్ అసద్ అధికారం చేపట్టారు. 2000 వరకు ఆయన అధికారంలో కొనసాగారు. అప్పటినుంచి హఫీజ్ కుమారుడు బషర్ పదవి చేపట్టారు. దాదాపు 25 ఏళ్లు సాగిన ఆయన పాలనకు ఆదివారంతో తెరపడింది. దీంతో అసద్ దేశాన్ని విడిచి రష్యాకు పారిపోయారు.
అధ్యక్ష భవనం లూటీ
అచ్చం బంగ్లాదేశ్, శ్రీలంక తరహాలోనే సిరియాలోనూ అసద్ విలాసవంతమైన అధ్యక్ష భవనంలోకి ప్రజలు చొరబడ్డారు. అసద్ ఇంట్లోని ప్లేట్లు, ఫర్నిచర్.. ఆఖరికి షాండ్లియర్ సహా దొరికిన వస్తువులను దొరికినట్లు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు వచ్చాయి.
బంకర్ వీడియోనే హైలైట్
55 ఏళ్లుగా తిరుగులేని రాజ్యాధికారం.. దీన్నిబట్టే అసద్ కుటుంబం ఎంతటి సంపద పోగేసి ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. దీంతోనే ఈ మాజీ అధ్యక్షుడి ‘ఫ్యామిలీ బంకర్’ పేరిట వీడియోలు బయటకు వచ్చాయి. అవి వైరల్ అవుతున్నాయి. అందులో పదుల సంఖ్యలో అత్యంత ఖరీదైన పోర్షె, ల్యాంబోర్గిని, ఫెరారీ, మెర్సిడెజ్-బెంజ్, ఆడీ సహా పలు కార్లు కనిపించాయి. తిరుగుబాటుదారులు అసద్ ఇంట్లోని పలు తలుపులు తెరిచాక ఓ సొరంగ మార్గం బయటపడిందని.. వారికి సంబంధించిన బంగారు ఆభరణాలు, ఆయుధ నిల్వలు భారీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా, ఈ వీడియోలో అధ్యక్షుడి నివాసం లోపల భారీ సొరంగం, దాని చివర్లో చెల్లాచెదురుగా పెట్టెలు, ఇతర వస్తువులు, విశాల గదులు కనిపిస్తున్నాయి. విలాసవంతమైన కార్లు ఉన్న ఇది ప్రైవేటు గ్యారేజీ. కొందరు తిరుగుబాటుదారులు వివిధ బ్యాంకులపై దాడి చేసి, నగదు పెట్టెలతో పారిపోయి వైనం వైరల్ గా మారింది.