తాజ్‌మహల్‌కు ప్రమాదం పొంచి ఉన్నదా..? అధికారులు ఏమంటున్నారు..?
తాజ్‌మహల్‌ను ఆనుకొని ఉన్న తోట కూడా దాదాపుగా మునిగిపోయింది. అలాగే.. తాజ్‌మహల్ ప్రధాన గోపురంపై లీకేజీని ఓ అధికారి గుర్తించాడు. ఆ వెంటనే పై అధికారులకు సమాచారం అందించాడు.
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన తాజ్‌మహల్ ఇప్పుడు ప్రమాదం పడిందా..? వరుసగా కురుస్తున్న వర్షాలతో తాజ్‌మహల్‌కు ప్రమాదం ముంచుకొచ్చిందా..? గోపురంలో వచ్చిన లీకేజీలు ఆందోళన కలిగిస్తున్నాయా..? ఇంతకీ ఈ లీకేజీలపై అధికారులు ఏం చెబుతున్నారు..? ఒకసారి తెలుసుకుందాం.
1631వ సంవత్సరంలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న కాలంలో అతని మూడో భార్య ముంతాజ్ మహల్ 14వ సంతానికి జన్మనిస్తూ ప్రాణాలు కోల్పోతుంది. దాంతో షాజహాన్ విచారంలో మునిగిపోతాడు. చివరిదశలో ఉన్న ముంతాజ్.. షాజహాన్‌ను ఓ కోరిక కోరుతుంది. ప్రపంచంలో ఎవరూ ఇంతవరకు చూడని అత్యంత సుందరమైన సమాధిని తన కోసం నిర్మించమని అడుగుతుంది.
దాంతో షాజహాన్ తన భార్య కోరిక మేరకు ఆమె మరణించిన సంవత్సరం తరువాత 1632వ సంవత్సరంలో తాజ్‌మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. తెల్లటి పాలరాయితో నిర్మించిన తాజ్‌మహల్ రానురాను పర్యాటక గుర్తింపు వచ్చింది. ప్రపంచంలోనే మేటి సంపదగా పేరుగాంచింది. ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో ఒకటిగా నిలిచింది. అందుకే.. నిత్యం దేశవిదేశాల నుంచి తాజ్‌మహల్‌కు యాత్రికులు వస్తుంటారు.
అంతటి ప్రాచూర్యం పొందిన తాజ్‌మహల్ ఇన్నేళ్లకు ప్రమాదంలో పడినట్లుగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాలో ఈ తాజ్‌మహల్ ఉంది. అక్కడ రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తాజ్‌మహల్‌ను ఆనుకొని ఉన్న తోట కూడా దాదాపుగా మునిగిపోయింది. అలాగే.. తాజ్‌మహల్ ప్రధాన గోపురంపై లీకేజీని ఓ అధికారి గుర్తించాడు. ఆ వెంటనే పై అధికారులకు సమాచారం అందించాడు. అటు వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో అధికారులు స్పందించారు.
మూడు రోజులుగా ఆగ్రాలో కురుస్తున్న వర్షాలతో తాజ్‌మహల్ ప్రధాన డోమ్ వద్ద నీరు లీక్ అవుతున్నట్లు ఆగ్రా సర్కిల్‌కు చెందిన సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్‌కుమార్ పటేల్ చెప్పారు. డ్రోన్ కెమెరాల సహాయంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. సీపేజ్ వ్యవస్థలో లోపం కారణంగానే ఇలా జరిగిందని స్పస్టం చేశారు. దీనివల్ల ఎలాంటి నస్టం ఉండబోదని అన్నారు. కాగా.. ఆగ్రాలో గురువారం 151 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 80 ఏళ్లలో 24 గంటల్లో ఇక్కడ నమోదైన వర్షపాతం ఇదే అత్యధికం. జాతీయ రహదారులన్నీ జలమయం కాగా.. పంటలు పూర్తిగా నీటమునిగాయి.