అమీర్ పేట లో ఎన్టీఆర్ విగ్రహం... బాబు అరెస్ట్ పై తలసాని కీలక వ్యాఖ్యలు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అవ్వడంపై గత కొన్ని రోజులుగా తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో ఖండిస్తున్న సంగతి తెలిసిందే

Update: 2023-11-19 04:23 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అవ్వడంపై గత కొన్ని రోజులుగా తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో ఖండిస్తున్న సంగతి తెలిసిందే. కారణం ఏదైనప్పటికీ ఈ విషయంపై సనత్ నగర్ బీఆరెస్స్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి తాజాగా స్పందించారు. ఇదే సమయంలో నందమూరి తారక రామారావు పై తన అభిమానాన్ని వెల్లడించారు. కమ్మ సేవాసమితి వనమహోత్సవంలో పాల్గొన్న సందర్భంగా తలసాని ఈ వ్యాఖ్యలు చేశారు.

అవును... టీడీపీ అధినేత చంద్రబాబును జైలు పంపించడం బాధాకరమని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఎస్.ఆర్. నగర్ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో సనత్‌ నగర్‌ లోని మోడల్‌ కాలనీలో జరిగిన కార్తిక వనమహోత్సవంలో పాల్గొన్న సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి.. రాజకీయాలు ఎప్పటికీ ఉంటాయని తెలిపిన తలసాని... ఓ వ్యక్తిపై కేసులు పెట్టి హింసించాలనే ఆలోచనను ఎవరూ హర్షించరని తెలిపారు.

అనంతరం ఎన్టీఆర్ గురించి స్పందించిన తలసాని... తాను చిన్నప్పటినుంచీ ఎన్టీఆర్ ఫ్యాన్ ని అని తెలిపారు. తన రాజకీయ జీవితం ఎన్టీఆర్‌ పెట్టిన భిక్షేనని, ప్రాణం ఉన్నంత వరకు ఆయన్ను మరిచిపోనని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. అమీర్‌ పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. అమీర్ పేటలోనే కాదు... సనత్ నగర్ లో ఎన్టీఆర్ విగ్రహం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతానని ఈ సందర్భంగా తలసాని హామీ ఇచ్చారు.

1994లో ఎన్టీఆర్... తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే చిన్న మొక్కను నాటితే అది ఈ రోజు చెట్టు అయ్యింది, ఇంత పెద్ద వృక్షమై కూర్చుంది అని వెల్లడించిన తలసాని... ప్రాణమున్నంత వరకూ ఎన్టీఆర్ ని మరిచిపోయేది లేదని వెల్లడించారు. ఇదే సమయంలో తన జీవితం ఎన్టీఆర్ పెట్టిన బిక్షేనని ఈ సందర్భంగా తలసాని పునరుధ్గాటించారు. అయితే ఎన్నికలు ముందున్నాయి, నాలుగు ఓట్లు పడతాయనే ఆలోచనతో ఈ మాటలు చెప్పడం లేదని ఈ సందర్భంగా తలసాని వ్యాఖ్యానించడం గమనార్హం!

Tags:    

Similar News