30 ఏళ్లుగా.. 5 సార్లు పోటీ.. అయినా ఓటమే

రాజకీయాలు ఎంతో చిత్రమైనవి. ఎన్నికల్లో గెలిపించి మంచి హోదానిస్తాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓటమి వైపే నిలిచి నిరాశ కలిగిస్తాయి.

Update: 2023-11-04 09:32 GMT

రాజకీయాలు ఎంతో చిత్రమైనవి. ఎన్నికల్లో గెలిపించి మంచి హోదానిస్తాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓటమి వైపే నిలిచి నిరాశ కలిగిస్తాయి. తొలిసారే ఎన్నికల బరిలో నిలిచి విజయాలు సాధించిన నాయకులు ఎంతో మంది. కానీ ఎన్ని సార్లు ప్రయత్నించినా.. సుదీర్ఘ కాలంగా పోరాడినా.. ఒక్కసారి కూడా గెలవలేని నాయకుల సంఖ్య కూడా ఎక్కువే. వీళ్లలో కొంతమంది ఇక చాలని రాజకీయాల నుంచి తప్పుకుంటే.. ఒక్కసారైనా గెలవాలనే సంకల్పంతో మరికొందరు సాగుతున్నారు. బీజేపీ నేత తల్లోజు ఆచారి రెండో కోవలోకి వస్తారు. 30 ఏళ్లుగా ఎన్నికల్లో విజయం కోసం ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతూనే ఉన్నారు.

ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే లక్ష్యంతో తల్లోజు ఆచారి సాగుతున్నారు. వరుసగా ఓటములు ఎదురైనా తగ్గేదే లేదంటూ ముందుకే అడుగేస్తున్నారు. ఇప్పుడు ఆరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లుకు చెందిన బీజేపీ నాయకుడు తల్లోజు ఆచారి ఈ సారి గెలుస్తాననే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. 1984లో ఆయన బీజేపీలో చేరారు. 1994లో తొలిసారి కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. 1999 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తిరిగి వరుసగా 2004, 2009, 2014, 2018లో బీజేపీ నుంచే బరిలో నిలిచారు. అయినా గెలుపు దక్కలేదు.

2014లో అయితే తల్లోజు ఆచారి కేవలం 78 ఓట్లతో పరాజయం పాలయ్యారు. అప్పుడు ఆయన దురద్రుష్టం చూసి జాలిపడని వాళ్లు లేరనే చెప్పాలి. ఇప్పటివరకూ 30 ఏళ్లుగా అయిదు సార్లు ఎన్నికల్లో పోటీ చేసినా ఎమ్మెల్యే కాలేకపోయిన ఆచారి ఓ సారి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 1995లో సర్పంచ్ గా పదవి చేపట్టారు. వరుసగా ఎన్నికల్లో ఓటమి ఎదురవుతున్నా.. తాను నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి బీజేపీలోనే ఆయన కొనసాగుతుండటం విశేషం. మరి ఈ సారైనా ఆరో ప్రయత్నంలో ఆచారి గెలుస్తారేమో చూడాలి.

Tags:    

Similar News