స్పీకర్ తమ్మినేని భావోద్వేగం వెనక...!?

తనకు అయిదేళ్ళూ సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు చెబుతూనే ఆయన తనకు ఈ అవకాశం ఇచ్చిన వైసీపీకి జగన్ కి థాంక్స్ చెప్పారు.

Update: 2024-02-10 03:53 GMT

ఇటీవల ఏపీ అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజుల పాటు జరిగాయి. ఈ సమావేశాల చివరన ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. నిజానికి చూస్తే ప్రతీ ప్రభుత్వం చివరిలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాలలో భావోద్వేగాలు చాలా కనిపిస్తాయి. సభ్యులు అంతా తమ గుండెను విప్పి మాట్లాడుతారు. ఈసారి అలా జరగలేదు. అసలు సభలో సభ్యుల హాజరే పలుచగా ఉంది. విపక్షం టీడీపీ అయితే సస్పెండ్ అవుతూనే ఉంది.

ఈ నేపధ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఎమోషన్ తో కూడిన ప్రసంగం చేశారు. తనకు అయిదేళ్ళూ సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు చెబుతూనే ఆయన తనకు ఈ అవకాశం ఇచ్చిన వైసీపీకి జగన్ కి థాంక్స్ చెప్పారు. అలా ఆయన మనసు విప్పి చాలా మాట్లాడారు. ఆయన అలా ఎందుకు మాట్లాడారు అన్నది చర్చకు వస్తోంది.

స్పీకర్ ఈ సందర్భంగా తన సొంత జిల్లా శ్రీకాకుళం గురించి కూడా ప్రస్తావించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన నాలుగవ స్పీకర్ ని తాను అన్నారు. తాను సభను సజావుగా నడిపించాను అని చెప్పుకున్నారు. సరే ఆయన చెప్పారు కాబట్టి శ్రీకాకుళం నుంచి ఎవరెవరు స్పీకర్లు అయ్యారో చూస్తే కనుక రొక్కం నరసింహం దొర 1955 నుంచి 1956 వరకు ఏణ్ణర్ధం పాటు ఆంధ్ర రాష్ట్రం రెండవ స్పీకర్ గా వ్యవహరించారు.

ఆ తరువాత శ్రీకాకుళం జిల్లా నుంచి తంగి సత్యనారాయణ 1983 నుంచి 1984 వరకూ ఏడాదిన్నర పాటు స్పీకర్ గా ఇదే శ్రీకాకుళం జిల్లా నుంచి పనిచేశారు. అలా శ్రీకాకుళం జిల్లా నుంచి కావలి ప్రతిభా భారతి 1999 నుంచి 2004 వరకూ అయిదేళ్ళ పాటు పనిచేశారు. ఇక తమ్మినేని సీతారాం 2019 నుంచి 2024 వరకూ అయిదేళ్ల పాటు స్పీకర్ గా చేశారు.

ఈ నలుగురిలో మిగిలిన ముగ్గురూ స్పీకర్ తరువాత రాజకీయంగా తిరిగి ప్రభావం చూపించలేకపోయారు. ప్రతిభా భారతి అయితే ఎమ్మెల్యేగా మళ్ళీ గెలవలేదు. తంగి సత్యనారాయణ నాదెండ్ల భాస్కరరావు వర్గంలో చేరి నెల రోజుల మంత్రి అయి ఆ మీదట రాజకీయంగా కనుమరుగు అయ్యారు. ఇలా స్పీకర్లుగా చేసినవారికి రాజకీయంగా ఇబ్బందులు వస్తాయన్నది ఒక సెంటిమెంట్.

దాంతో తమ్మినేని వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఎమోషన్ అయ్యారా అన్న చర్చ నడుస్తోంది. ఆయన కూడా 1999 తరువాత మళ్లీ ఇరవై ఏళ్ళకు అంటే 2019లో ఎమంల్యేగా చట్ట సభలోకి వచ్చారు. మంత్రి కావాలని ఆయన బలంగా కోరుకున్నారు. కానీ స్పీకర్ గానే జగన్ ఉంచేశారు.

ఈసారి ఆయనకు టికెట్ దక్కుతుందా అన్నది ఒక చర్చ అయితే దక్కినా గెలుస్తారా అన్నది మరో చర్చ. ఆముదాల వలసలో ఆయనకు ఎదురు గాలి వీస్తోంది అని సర్వేలు చెబుతున్నాయి. అక్కడ సొంత మేనల్లుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ప్రత్యర్ధిగా ఉన్నారు. ఇక ఏడు పదులకు చేరువలో ఉన్న తమ్మినేనికి ఇవే చివరి ఎన్నికలు అంటున్నారు.అలా అన్నీ తలచుకునే ఆయనలో భావోద్వేగం పొంగిందని అంటున్నారు.


Tags:    

Similar News