టార్గెట్ జగన్... ట్విట్టర్ లో వైరల్ గా బ్యాండేజ్ ఛాలెంజ్!
ఇందులో భాగంగా నుదిటిన బ్యాండైడ్ వేసుకుని ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. దీంతో బ్యాండైడ్ ఛాలెంజ్ వైరల్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్రలో భాగంగా... విజయవాడలో పర్యటిస్తున్న సమయంలో ఒక దుండగుడు దాడిచేసిన సంగతి తెలిసిందే. ఆ దుర్మార్గం వెనుక ఎవరున్నారనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఆ సమయంలో జగన్ నుదిటిన గాయం అయ్యింది.. వైద్యులు కుట్లు వేశారు.. జగన్ ఆ గాయంపై బ్యాండేజ్ వేసుకుని జనాల్లో తిరుగుతున్నారు!
అయితే ఈ బ్యాండెజ్ పై పలువురు నెట్టింట వెటకారం ఆడుతున్నారు. ఇదే సమయంలో... గురువారం మీడియాతో మాట్లాడిన వైఎస్ వివేకా కుమార్తె సునీత ఇదే విషయంపై స్పందించారు. ఇందులో భాగంగా జగన్ ఇకపై ఆ బ్యాండేజ్ తీసేస్తేనే బెటర్ అని, లేకపోతే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు, జగన్ కు వైద్యులు సరైన సలహా ఇవ్వడం లేదని చెబుతూ, ఒక డాక్టర్ గా ఇది తన సలహా అని అన్నారు.
ఇదే విషయం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ట్విట్టర్ లో స్పందించారు. "2014, 2019 ఎన్నికల్లో శవరాజకీయాలతో నెట్టుకొచ్చిన జగన్... ఈసారి ఒక డ్రామాతో వచ్చాడు. కనపడని ఒక గులకరాయి తగిలిందంట. బ్యాండ్ వేసాడు. రోజురోజుకు ఆ బ్యాండ్ పెద్దదవుతోంది. మే 13 ఎన్నికల రోజు వరకు డ్రామా ఆడిస్తానే ఉంటాడు ఈ నాటకాల రాయుడు" అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు! అంతకముందు... ఈ దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు!!
మరోపక్క టీడీపీ నేటిజన్లు జగన్ బ్యాండేజ్ సైజులపై రీసెర్చ్ చేస్తుంది! ఇందులో భాగంగా... జగన్ నుదిటిని బ్యాండేజ్ సైజ్ పెరిగిందంటూ టీడీపీ శ్రేణులు పోస్టులు పెడుతున్నాయి. ఈ నెల 13న బ్యాండేజ్ సైజు చిన్నగా ఉంది.. ప్రస్తుతం అది పెద్దగా అయ్యింది అంటూ... “హాష్ ట్యాగ్ బ్యాండైడ్ ఛాలెంజ్” పేరుతో ట్విట్టర్ లో ఛాలెంజ్ విసురుకుంటున్నారు.
ఇందులో భాగంగా నుదిటిన బ్యాండైడ్ వేసుకుని ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. దీంతో బ్యాండైడ్ ఛాలెంజ్ వైరల్ గా మారింది. ఈ సందర్భంగా నెట్టింట టీడీపీ శ్రేణులు చేస్తున్న వెటకారం పీక్స్ గా ఉందని అంటున్నారు!
మరోపక్క... ఇది గిగజారుడుతనంలో పీక్స్ అని.. దీనివల్ల ఒరిగేది ఏమీ ఉండదనే విషయం టీడీపీ శ్రేణులకు ఎప్పుడు అర్ధమవుతుందో అని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. దుమ్ము పడుతుందనో.. లేక, మరేమైనా తగులుతుందనో... కారణం ఏమైనా కావొచ్చు.. ఆయన గాయం, ఆయన బ్యాండేజ్, ఆయన సైజు ఆయన ఇష్టం.. ఇంకోటి ఏమైనా ట్రైన్ చేయండి అంటూ వైసీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నారు.