టార్గెట్ మల్లారెడ్డి? రేవంత్ సర్కారు వేట మొదలైందా?

అంతేకాదు.. అప్పట్లో మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి.. మల్లారెడ్డి భూదందాలకు సంబంధించిన ఆరోపణల్ని ఆధారాలతో సహా నిరూపిస్తానని సవాలు విసరటం తెలిసిందే.

Update: 2023-12-14 06:51 GMT

మాజీ మంత్రి మల్లారెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాలమ్మి.. పూలమ్మి.. ఇంత స్థాయికి వచ్చినట్లు ఆయన చెప్పుకున్నా.. పలు భూదందాలే ఆయన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చాయన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తుండటం తెలిసిందే. మంత్రిగా ఉన్న వేళలోనూ ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం తెలిసిందే. అంతేకాదు.. అప్పట్లో మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి.. మల్లారెడ్డి భూదందాలకు సంబంధించిన ఆరోపణల్ని ఆధారాలతో సహా నిరూపిస్తానని సవాలు విసరటం తెలిసిందే.

అప్పట్లో మల్లారెడ్డి భూకబ్జా వ్యవహారాలపై ఇరువురు నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. అప్పట్లో మల్లారెడ్డి మంత్రిగా వ్యవహరిస్తే.. రేవంత్ విపక్ష ఎంపీగా ఉండేవారు. మారిన కాలంతోపాటు.. కొత్త సమీకరణాల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి మాజీ కావటం.. ఎమ్మెల్యేగా మాత్రమే గెలుపొందగా.. రేవంత్ మాత్రం ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో.. ఇప్పుడు సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇదిలా ఉంటే.. తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామం సంచలనంగా మారింది. పరిస్థితుల్ని చూస్తుంటే.. మల్లారెడ్డి అక్రమాలపై రేవంత్ నజర్ పడిందన్న మాట బలంగా వినిపిస్తోంది.

తాజాగా మల్లారెడ్డి భూకబ్జాకు పాల్పడ్డారని పేర్కొంటూ భిక్షపతి అనే వ్యక్తి శామీర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాల గిరిజన భూమిని మాజీ మంత్రి కబ్జా చేశారని ఆరోపించారు. దీనిపై స్పందించిన పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేయటం గమనార్హం. ఇదిలా ఉంటే.. రాజకీయంగా మల్లారెడ్డికి.. రేవంత్ కు అస్సలు పొసగదని చెబుతారు. అప్పట్లో రెడ్ల సామాజిక వర్గానికి చెందిన సమావేశంలో మంత్రిగా ఉన్న మల్లారెడ్డిపై దాడి జరగటం సంచలనంగా మారింది.

అయితే.. ఆ ఉదంతంలో రేవంత్ పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో మల్లారెడ్డి సైతం ఇదే వ్యాఖ్యలు చేస్తూ.. రేవంత్ పై పరుష వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా రేవంత్ ముఖ్యమంత్రి కావటంతో మల్లారెడ్డిపై వచ్చే ఆరోపణలపై అధికారులు సీరియస్ గా నజర్ వేయాలన్న సంకేతాలు అందినట్లుగా చెబుతున్నారు. నిజానికి.. మల్లారెడ్డిపై మొదట్నించి భూకబ్జా ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే.. ఆయన అధికారపక్షంలో ఉండటంతో ఆయనపై వచ్చే ఆరోపణలు ముందుకు వెళ్లలేదు. అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. రేవంత్ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో కష్టాలు తప్పవంటున్నారు. జైలుకు పంపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News