బీఆర్ఎస్ అసెంబ్లీ టికెట్ కు పక్కనపెట్టి.. ఎంపీ టికెట్ కు పట్టం..
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి పలుసార్లు గెలుపొంది తెలంగాణ తొలి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగానూ పనిచేసిన తాటికొండ రాజయ్యకు ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు.
తెలంగాణలో అధికారం కోల్పోయిన తరవాత నాయకుల వలసలతో కుదేలవుతున్న కారు పార్టీ.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంది. లోక్ సభ ఎన్నిలకు టికెట్ ఖాయమైన ఎంపీలు కూడా పార్టీని వీడడంతో దిక్కుతోచడం లేదు. ఏరికోరి టికెట్ ఇచ్చినవారూ చేయిస్తుండడంతో హతాశురాలవుతోంది. ఇలాంటి సమయంలో వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా అనూహ్య ఎంపిక జరిగింది.
వద్దనుకున్న రాజయ్య ముద్దయ్యారు
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి పలుసార్లు గెలుపొంది తెలంగాణ తొలి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగానూ పనిచేసిన తాటికొండ రాజయ్యకు ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. తొలి టర్మ్ లోనే డిప్యూటీ సీఎంగా తొలగించిన ఆయనను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు. మొన్నటి ఎన్నికల్లో టికెట్ కూడా నిరాకరించారు. దీంతోనే పార్టీ ఓటమి తర్వాత రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అయితే, కాంగ్రెస్ నుంచి ఎలాంటి పిలుపురాకపోవడంతో రాజయ్య చౌరస్తాలో ఉండిపోయారు. ఇప్పుడు ఆయన రాజీనామాను పక్కనపెట్టిన బీఆర్ఎస్ ఏకంగా వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వడం గమనార్హం.
నాడు అడ్డుపడ్డ కడియం.. నేడు రూట్ క్లియర్ చేశారు.
స్టేషన్ ఘనపూర్ లో మొన్నటి ఎన్నికల్లో రాజయ్యను కాదని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అక్కడ ఆయన గెలుపొందారు. ఇక శ్రీహరి కుమార్తె కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ కూడా కేటాయించారు. అయితే, తండ్రీకూతురు ఇద్దరూ ఆ పార్టీ అధిష్ఠానానికి షాక్ ఇస్తూ కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు కావ్య వద్దనుకున్న టికెట్ రాజయ్యకు దక్కింది. అంటే.. ఘనపూర్ లో రాజయ్యకు టికెట్ దక్కకపోవడానికి కడియం శ్రీహరి కారణమైతే.. వరంగల్ ఎంపీ టికెట్ పొందేందుకు ఆయన కుమార్తె కారణమయ్యారన్నమాట.
అసెంబ్లీకి ఇవ్వకుండా.. ఎంపీకి ఎలా?
పలు ఆరోపణలు, వ్యక్తిగత విషయాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. అదే రాజయ్యకు ఇప్పుడు పిలిచి మరీ ఏకంగా ఎంపీ టికెట్ ఇవ్వడం విచిత్రం. అయితే, అప్పుడు అర్హులు కాని రాజయ్య ఇప్పుడు ఎలా అర్హులు అయ్యారనేది బీఆర్ఎస్ అధిష్ఠానం సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్న.