కాంగ్రెస్ నుంచి పిలుపురాదు.. కేసీఆర్ పిలవరు.. అడకత్తెరలో ఆ నేత!

తెలంగాణ ఏర్పాటైన వెంటనే కొలువుదీరిన కేసీఆర్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక పదవి దక్కించుకున్నారు స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.

Update: 2024-04-10 15:30 GMT

‘‘కష్ట కాలంలో వెళ్లిపోయినవారిని తిరిగి చేర్చుకునే పనేలేదు..’’ ఇదీ బీఆర్ఎస్ ఇప్పటి మాట. అధికారంలో ఉండగా.. ప్రతిపక్ష నేతలను ఎడాపెడా పార్టీలోకి తీసుకోవడంతో కారు కిక్కిరిసింది. ఓ దశలో జిల్లాకు మూడు గ్రూపులు ఆరుగురు నాయకులుగా తయారైంది పరిస్థితి. దీంతోనే మొన్నటి ఎన్నికల్లో కొంత దెబ్బపడిందని కూడా భావించవచ్చు. ఇక గులాబీ పార్టీ ప్రతిపక్షంలోకి మారాక వలస నాయకులు ఒకరి వెంట ఒకరు తమ దారి తాము చూసుకుంటున్నారు. వీరిలో ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి మునిసిపల్ చైర్మన్లు కూడా ఉండడం గమనార్హం.

బీఆర్ఎస్ వయా కాంగ్రెస్..

తెలంగాణ ఏర్పాటైన వెంటనే కొలువుదీరిన కేసీఆర్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక పదవి దక్కించుకున్నారు స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. స్వతహాగా వైద్యుడు కూడా అయిన ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ దక్కింది. అయితే, ఈ ముచ్చట ఎన్నాళ్లో సాగలేదు. రాజయ్య పనితీరు నచ్చని కేసీఆర్.. అవినీతి ఆరోపణల పేరిట ఆయననున పక్కనపెట్టారు. రాజయ్య చిరకాల ప్రత్యర్థి కడియం శ్రీహరిని ఎంపీగా రాజీనామా చేయించి ఎమ్మెల్సీని చేసి డిప్యూటీ సీఎంను చేశారు. ఇక అప్పటినుంచి రాజయ్య ప్రాభవం తగ్గుముఖం పట్టింది. 2018లోనూ గెలిచినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. అయితే, మహిళా సర్పంచికి వేధింపుల ఆరోపణలు సహా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర చర్చనీయాంశం అయ్యారు. ఫలితంగా ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. రాజయ్య దీంతో పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. కానీ, ఫలితాల అనంతరం బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

కాంగ్రెస్ నుంచి పిలుపురాదు.. కేసీఆర్ పిలవరు..

బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన రాజయ్యకు కాంగ్రెస్ నుంచి పిలుపురాలేదు. ఈ లోపే ఆయన చిరకాల ప్రత్యర్థి కడియం శ్రీహరి కుమార్తెతో సహా కాంగ్రెస్ లో చేరారు. ఏకంగా కుమార్తెకు ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. దీంతో రాజయ్య ఎటూకాకుండా పోయారు. అందుకే కేసీఆర్ పిలిస్తే బీఆర్ఎస్ లో చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, కేసీఆర్ నుంచి ఆయనకు పిలుపు వెళ్లలేదు.

వరంగల్ టికెట్ వారికే..

బీఆర్ఎస్ వరంగల్‌ లోక్‌సభ టికెట్ ను పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకే ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. సిటింగ్ ఎంపీ పసునూరి దయాకర్ సహా టిక్కెట్ రేసులో ఉన్న ప్రధాన దళిత నేతలంతా వెళ్లిపోవడంతో అభ్యర్థి ఎంపిక క్లిష్టంగానే మారింది. అయితే, కడియం కావ్యకు సరైన పోటీ రాజయ్యేనని.. ఆయననే దింపాలని కొంతమంది నేతలు కేసీఆర్ కు సూచిస్తున్నారు. అయితే, చిన్న కారణాలతో పార్టీ మారిన రాజయ్యపై బీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి నమ్మకం లేకపోవడంతో కొత్త అభ్యర్థిని వెదికే పనిలో ఉన్నారు. వరంగల్‌ జిల్లా సీనియర్లతోపాటు పార్టీలోని ముఖ్య నేతలతో కొద్ది రోజులుగా కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. ఉద్యమ నేత పరంజ్యోతి, హన్మకొండ జడ్పీ చైర్‌ పర్సన్‌ సుధీర్‌ కుమార్‌ తదితరుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో ఒకరిని ప్రకటించే అవకాశం ఉంది.

Tags:    

Similar News